Idream media
Idream media
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాదాపు 8 ఏళ్లుగా రాజకీయంగా మౌనం పాటిస్తున్న డీఎల్ రవీంద్రా రెడ్డి.. చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించారు.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి1978లో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. 1983 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ఘిగా పోటీ చేసిన డీఎల్ రవీంద్రా రెడ్డి 1985, 1999 మినహా మిగతా ఐదుసార్లు గెలిచారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్.. పలుమార్లు మంత్రిగా పని చేశారు. చివరగా కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2011లో కడప లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎల్ డిపాజిట్ కోల్పోయారు.
Also Read : RK Death – దివికేగిన ఆర్కే.. ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
2024లో పోటీపై ప్రకటన.. ప్రభుత్వంపై విమర్శలు..
తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన డీఎల్ రవీంద్రా రెడ్డి.. 2024లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు డీఎల్. ప్రతిభ ఆధారంగానే పార్టీ టిక్కెట్ వస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన డీఎల్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. తన పొలం కౌలుకు ఇస్తామన్నా కౌలుకు సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు.
ప్రజలకు సలహాలు.. మీడియాకు సూచనలు..
ప్రజలు సొంతంగా సంపాదించడం నేర్చుకోవాలని డీఎల్ రవీంద్రా రెడ్డి సలహాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరూ బతకవద్దని సూక్తులు చెప్పారు. సమాజంలో అక్రమాలను మీడియా ప్రశ్నించాలని సూచించారు. ప్రశ్నించకుంటే సమాజం అథోగతిపాలవుతుందని చెప్పుకొచ్చారు. పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమమని సలహ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరూ ఆలోచించడం లేదన్నారు
Also Read : Badvel By Poll-బద్వేల్ లో బీజేపీ కి ఎందుకు టెన్షన్ పట్టుకుంది?