దుబ్బాక ఉప ఎన్నిక‌‌పై మోగిన న‌గారా

దేశంలో ఉప ఎన్నిక‌ల‌కు న‌రాగా మోగింది. దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. తాజాగా షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. ఆ 56లో మ‌‌ధ్య ప్ర‌దేశ్ లోనే 28 స్థానాలు ఉన్నాయి. ఆయా నేత‌లు పార్టీలు మార‌డంతో ఏర్ప‌డ్డ ఖాళీలివి. అలాగే గుజరాత్ లోనూ 8 నియోజ‌క‌వ‌ర్గాలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి దుబ్బాక లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

షెడ్యూల్ ఇదే..

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 9న నోటిఫికేషన్‌ విడుదల చేసి.. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు.

మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా నోటిఫికేషన్‌ రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. నామినేషన్ల దాఖలకు ప్రారంభం తేదీ అక్టోబర్ 9 కాగా.. చివరి తేదీ అక్టోబర్ 16. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 17. ఉపసంహరణకు అక్టోబర్ 19 వర‌కు గ‌డువు ఇచ్చింది. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయ పార్టీల‌న్నీ ఎన్నిక‌లో పోటీపై వ‌డివ‌డిగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌తో బిజీగా గ‌డుపుతున్నాయి.

Show comments