మాట‌ల మంట‌లు : టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ

రామాలయం నిర్మాణం పేరుతో బీజేపీ నేత‌లు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. ఆయ‌న ఇంటిపై బీజేపీ కార్య‌క‌ర్త‌ల దాడుల వివాదం చినికి చినికి గాలివాన‌లా మారుతోంది. వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తి మాట్లాడుతూ.. ఓసీ మహాగర్జన సభలో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యాఖ్యలు తప్పైతే ఆ వ్యాఖ్యలను విరమించుకుంటున్నానని ప్రకటించినా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య మాత్రం మాట‌ల మంట‌లు కొన‌సాగుతున్నాయి.

బీజేపీ దీనిపై ఏకంగా ఉద్య‌మానికే శ్రీ‌కారం చుడుతోంది. ‘‘రాముడిని అవమానించిన ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాం. అన్ని మండల కేంద్రాల్లో నల్ల గుడ్డలతో మౌన నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చాం. రాముని ఫొటోతో ర్యాలీలు చేస్తాం. రామాలయం నిర్మాణం లెక్కలు చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భద్రాద్రి ఆలయానికి రావాలని సవాల్. బీజేపీ నాయకులుగా మేం ఎవరూ ర్యాలీలో పాల్గొనడం లేదు.. హిందువులుగా పాల్గొంటున్నాము. తెలంగాణ కిష్కింధ కాండగా మారాలనుకుంటే అది టీఆర్‌ఎస్‌ విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నేత‌లు కూడా ఎమ్మెల్యే ఇంటిపై దాడి, బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మేం త‌లుచుకుంటే ఆ పార్టీ నేత‌లు బ‌య‌ట తిర‌గ‌లేరంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

‘టీఆర్‌ఎస్‌ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మా ఓపికకూ ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించినం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నం. టీఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దు’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరముందని తెలిపారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శల పరిధిని దాటి, బీజేపీ పదేపదే భౌతిక దాడులకు పాల్పడుతుండటం రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంటోందని పేర్కొంటూ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక అనంత‌రం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ పోరు తారాస్థాయికి చేరింది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి మ‌హా నేత‌లంద‌రూ విచ్చేసి టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్ స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వెలువ‌డిన‌నాటి నుంచీ ఇరు పార్టీల మ‌ధ్య ఎక్క‌డోచోట వాగ్వాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి వ్యాఖ్య‌లు, ఆయ‌న ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడితో ఇరు పార్టీల మ‌ధ్య వివాదం మ‌రోసారి ముదిరింది. ఈ క్ర‌మంలో రేపు బీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఈ ప‌రిణామాల‌న్నీ తెలంగాణ‌లో అధికారం కోసం బీజేపీ.. ప‌ట్టు కోల్పోకుండా టీఆర్ఎస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగానే క‌నిపిస్తున్నాయి. మ‌రి మున్ముందు తెలంగాణ రాజ‌కీయాల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Show comments