వంగవీటి రాధాకు అచ్చెం నాయుడు వార్నింగ్‌ ఇచ్చాడా..?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా స్పష్టత ఉంది. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసిన సరే ప్రస్తుతం పార్టీ గాడిలో పడే అవకాశాలు ఏ మాత్రం కూడా కనబడడం లేదు. ఈ తరుణంలో కొంతమంది నాయకుల విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరి అలాగే తెలుగుదేశం పార్టీ విషయంలో కొంతమంది నాయకులు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగానే ఉంది.

ఇటీవల వంగవీటి రాధాకృష్ణ గుడివాడ వెళ్లడం తెలుగుదేశం పార్టీ వర్గాల తో పాటుగా అధికార పార్టీ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూశాయి. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ తరుణంలో అక్కడ ఉన్న కొంత మంది స్థానిక నాయకులతో అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కొంత మంది కార్యకర్తలతో వంగవీటి రాధా క్రమంగా చర్చలు జరుపుతూ వస్తున్నారు.

పార్టీ బలోపేతం కోసం ఆయన నియోజకవర్గంలో కష్టపడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆయన విషయంలో ఎక్కువగా ప్రచారం చేయటం మొదలుపెట్టింది. అయితే వంగవీటి రాధ మాత్రం అక్కడి నుంచి పోటీ చేసే అంశానికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోగా తన స్నేహితుడు, మంత్రి కొడాలి నాని తో మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక పుట్టిన రోజు కార్యక్రమానికి సంబంధించి గుడివాడ వెళ్ళిన వంగవీటి రాధా అక్కడ మంత్రి కొడాలి నాని తో రహస్యంగా మంతనాలు జరిపారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

Also Read : బాబు వయసుకు పాదయాత్ర అవసరమా?

తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వంగవీటి రాధను అధికార పార్టీ లోకి తీసుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో కూడా కొడాలి నాని మాట్లాడుతున్నారని వంగవీటి రాధను కూడా ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలను వంగవీటి రాధా తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో సోషల్ మీడియాపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 2004లో చివరిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు.

అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన రాధా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని భావించిన ఆయనకు సీటు రాలేదు. అయితే 2019 నుంచి దాదాపు సైలెంట్ గానే ఉంటున్న వంగవీటి రాధా ఇటీవల గుడివాడ నియోజకవర్గం పై పార్టీ అధిష్ఠానం సూచనతో దృష్టి పెట్టారని… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అక్కడున్న నాయకులతో మాట్లాడితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నారని అలాగే కొడాలి నాని పై ఉన్న వ్యతిరేకతను కూడా చెప్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.

Also Read : టీడీపీ నేతలకు కొత్త తలనొప్పి, సీట్ల మార్పు మీద కుస్తీ

అయితే ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది… ఈ పరిణామం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది నాయకులు ఇతర నియోజకవర్గాలతో సంబంధం లేకపోయినా ఆయన నియోజకవర్గాలకు వెళ్లి పర్యటనలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని అచ్చంనాయుడు పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఎవరైనా సరే పార్టీ బాధ్యతలు అప్పగించిన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పర్యటన చేస్తే మాత్రం కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అచ్చం నాయుడు స్పష్టం చేశారు

ఇష్టానుసారం పార్టీని విమర్శించడం అలాగే పార్టీతో సంబంధం లేని నాయకులను కలవడం వంటి చర్యలను పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా పరిగణిస్తుంది అని ఇటువంటి చర్యలు జరిగితే కార్యకర్తలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని అచ్చెన్నాయుడు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన విడుదల చేసిన లేఖ ప్రకారం చూస్తే ఖచ్చితంగా వంగవీటి రాధాకు పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ ఒక పక్కన ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఇటువంటి హెచ్చరికలు పార్టీని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. మరి ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా భవిష్యత్తులో ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే ఆయన వైసీపీ లోకి వెళ్తే మాత్రం… టిడిపి విజయవాడ పరిధిలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read : నెగ్గిన అవిశ్వాస తీర్మానం – సుంకర పావని ఇక మాజీ మేయర్‌

Show comments