భద్రాచల రామయ్యకు తప్పని కరోనా ఎఫెక్ట్

  • Published - 08:15 AM, Tue - 17 March 20
భద్రాచల రామయ్యకు తప్పని కరోనా ఎఫెక్ట్

ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో జరిగే భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 న జరగాల్సిన సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరగనుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా దేశంలో కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణాలో ప్రతీ ఏటా భద్రాచలంలో వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలను భక్తులు లేకుండానే ఆలయ ప్రాంగణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అజయ్ కుమార్ వెల్లడించారు.

దీంతో భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యా సంస్థలు, థియేటర్లు, మాల్స్ మూసివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Show comments