టీడీపీ–కాంగ్రెస్‌ దోస్తీ కొనసాగుతుందా?!

కాంగ్రెస్‌ పార్టీమీద తిరుగుబాటు భావనతో ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారకరామారావు టీడీపీకి పురుడుపోసారు. ఆయన తరువాత పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడు తనకు రాజకీయ పుట్టుకను ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతో ఎప్పుడూ ఫైట్‌ చేసింది లేదనే చెబుతారు విశ్లేషకులు. దీనికి బలం చేకూర్చే విధంగా ఎకంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో టీడీపీకి హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌గా ఉన్న అనేక మంది తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి దూరమయ్యారని చెబుతుంటారు. కాంగ్రెస్‌ పార్టీ అండ చూసుకుని బీజేపీని, నరేంద్రమోడీని అనరాని మాటలెన్నో ఆ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు చంద్రబాబు, ఆయన బృందం.

అయితే ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీలతో రాజకీయ స్నేహాలను పక్కన పెట్టేసి మడికట్టుకుని హైదరాబాదులో కూర్చున్నారు. ఇదంతా పైకి కన్పించేది మాత్రమేనని చెబుతున్నారు విశ్లేషకులు. అంతర్లీనంగా కాంగ్రెస్‌–టీడీపీ స్నేహం కొనసాగుతోందని వివరిస్తున్నారు. ఇందుకు ఏపీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌నే ఉదాహరణగా చూపుతున్నారు. రాజధానిగా అమరావతిపై కోర్టులో ఉన్న కేసుల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను అఫిడవిట్‌ రూపంలో హైకోర్టు కోరింది. దీంతో ఆయా పార్టీలో తమతమత అభిప్రాయాల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పిస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ శైలజానాథ్‌ తన అఫిడవిట్‌ను ఇటీవల సమర్పించారు. ఈ నేపథ్యంలో స్క్రిప్టుమొత్తం టీడీపీయే రాసిచ్చిందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఒకే చోట రాజధాని రూపంలో పాలన కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఉండాలన్న సదుద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన వెలుగులోకొచ్చింది. సీయం వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ స్టాండ్‌పై రాష్ట్రం వ్యాప్తంగా ప్రజల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలు ఏమైపోయినాగానీ కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని పలు పార్టీలు అఫిడవిట్‌లు సమర్పించడం పట్ల ఇతర ప్రాంతాల్లోని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థాయిలో నష్టపోయిందో ఇప్పటికే తెలిసిందే. మళ్ళీ పుంజుకుందామన్న ఆశ ఉన్నవారు అమరావతి ఒక్కదానికే మద్దతుగా నిలబడడం ఆత్మహస్యాసదృశ్యమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. శైలజానాథ్‌ ఏ ప్రయోజనాలు ఆశించి ఈ అఫిడవిట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా టీడీపీ ట్రాప్‌లోనే కాంగ్రెస్‌పార్టీ ఉందన్న విషయం దీంతో బైటపడ్డటై్టంది. ఒక పక్క బీజేపీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే.. మరో పక్క తన రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీని కూడా చంద్రబాబు వాడుకుంటున్నాడన్న ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Show comments