మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు.. రంగంలోకి ప్రివిలేజ్‌ కమిటీ.. నిమ్మగడ్డకు షాక్‌ తప్పదా..?

ఒంటెద్దు పోకడలు అనుసరిస్తూ.. సర్వం తానే అన్నట్లు వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చిక్కులు ఎదురుకోబోతున్నారు. మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాతపూర్వకంగా గవర్నర్‌కు పిర్యాదు చేసిన వ్యవహారం చివరకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. తమను కించపరిచేలా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారించారని, సభాహక్కులు ఉల్లంఘించారని మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణలు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్పీకర్‌.. అసెంబ్లీ ప్రివేలేజ్‌ కమిటీకి పంపారు. దీనిపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి చైర్మన్‌గా గల ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఫిర్యాదులోని అంశాలు పరిశీలించిన కమిటీ.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని నిర్థారించింది.

విచారణకు స్వీకరణ..

ఎస్‌ఈసీ లేఖ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని నిర్థారించిన ప్రివిలేజ్‌ కమిటీ దానిని విచారణకు స్వీకరిచింది. గతంలో మహారాష్ట్రలోనూ ఇలాంటి విచారణ జరిగిందని కమిటీ చర్చించింది. విచారణలో భాగంగా తదుపరి చర్యలపై కమిటీ చర్చించింది. పూర్వాపరాలు, వాదప్రతివాదనలు విన్న తర్వాత ప్రివిలేజ్‌ కమిటీ తన నివేదికను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు.

ఆ వైఖరే మెడకుచుట్టుకోబోతోందా..?

గత మార్చిలో ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి భిన్నమైన దారిలో నడుస్తూ.. తాను అనుకున్నదే జరగాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే ఉంటాయని చెబుతూ.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు.. తన విభాగం అధికారులపై కూడా చర్యలకు సిఫార్సు చేస్తున్నారు. ఇది పరిధి దాటి.. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల వరకూ చేరింది. ప్రభుత్వం ఎలా పని చేయాలో, మంత్రులు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహారించాలో, ఏం మాట్లాడాలో కూడా నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిలు లక్ష్మణ రేఖ దాటి రాజకీయ విమర్శలు చస్తున్నారని, తనను విమర్శిస్తున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వారిని కట్టడి చేయకపోతే కోర్టుకు వెళతానంటూ కూడా బెదరింపు ధోరణిలో వ్యవహారించారు. ఇదే ఇప్పుడు నిమ్మగడ్డ మెడకు చుట్టుకుంది. ప్రివిలేజ్‌ కమిటీ విచారణ తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Show comments