చిన్న సినిమాకు ‘కలర్’ఫుల్ ఆఫర్

కరోనా వల్ల పరిశ్రమకు ఎంత తీరని నష్టం కలిగిందో దీని వల్ల అంతో ఇంతో మేలు జరిగింది ఎవరికైనా అంటే మంచి కంటెంట్ తో సినిమాలు తీసిన చిన్న నిర్మాతలకని చెప్పొచ్చు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది కలర్ ఫోటో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం కమెడియన్ గా ఇటీవలి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా అతని ప్రాణ స్నేహితుడు మసాలా సందీప్ డెబ్యూ దర్శకత్వంలో రూపొందుతున్న కలర్ ఫోటో షూటింగ్ చివరిదశకు చేరుకుంటోంది. థియేటర్లు తెరిచే మార్గం అంత సులువుగా కనిపించకపోవడంతో ఇది కూడా ఓటిటి బాటనే పట్టబోతున్నట్టు సమాచారం. కేవలం కోటిన్నర బడ్జెట్ లో రూపొందుతున్న కలర్ ఫోటోకు రెట్టింపు అంటే సుమారు మూడు కోట్ల దాకా డిజిటల్ ఆఫర్ వచ్చిందట.

ఓ యాభై లక్షలు అటు ఇటు తగ్గినా కూడా ఇది చాలా పెద్ద మొత్తం. ఇది కాకుండా శాటిలైట్ ద్వారా వచ్చేది అదనం. హిట్ అయ్యిందా రీమేక్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ వగైరా కలుపుకుని బంపర్ ఆఫర్ తగిలినట్టు నిర్మాత సాయి రాజేష్ కు జేబులు నిండిపోవడం ఖాయం. అయితే ఇదంతా లీకైన సమాచారాన్ని బట్టి చెబుతున్నదే తప్ప నిజంగా ఇంత అమౌంట్ తో డీల్ జరిగిందా లేదా అనేది వేచి చూడాలి. నల్లని అబ్బాయి తెల్లని అమ్మాయి మధ్య ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించడం ఇప్పటికే ప్రధాన ఆకర్షణగా మారింది. చాలా కాలంగా చిన్న వేషాలతో నెట్టుకొస్తున్న చాందిని చౌదరి కూడా దీన్నుంచి పెద్ద బ్రేక్ ఆశిస్తోంది. మసాలా సందీప్ టేకింగ్ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

లాక్ డౌన్ జరిగిన ఆరు నెలల కాలంలో మరీ బ్లాక్ బస్టర్ అనిపించిన తెలుగు సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య పర్వాలేదు అనిపించుకోగా వితో సహా దాదాపు అన్నీ యావరేజ్ మార్కుకు అటుఇటు ఊగినవే. గట్టి హిట్టు ఒక్కటి పడితే ఓటిటి రంగంలోనూ ఉత్సాహం వస్తుంది. ఇంకా అలాంటిది జరగలేదు. మరి కలర్ ఫోటో తన మీద ఉన్న తక్కువ అంచనాలను దాటుకుని ఏదైనా వండర్ చేస్తుందేమో చూడాలి. ఒకవేళ డీల్ కనక ఓకే అయితే దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీపావళికి ఓటిటి యాప్స్ లో హిందీ, తమిళ సినిమాల మధ్య భారీ పోటీ నెలకొనబోతోంది. అందుకే కలర్ ఫోటో లాంటివి ముందే వచ్చేస్తే బెటర్. ఆహా యాప్ లో రావొచ్చని వినికిడి. గతంలో అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన సపోర్ట్ తోనే సాయి రాజేష్ కొబ్బరిమట్ట విడుదల అడ్డంకులను దాటేశాడు. మరి ఇప్పుడు కలర్ ఫోటో ఆహాలో వస్తే ఆశ్చర్యమేముంది

Show comments