విపక్షాల నోళ్లకు తాళం.. వెలిగొండపై జగన్‌ స్పష్టత

ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, వైఎస్సార్‌ కడపజిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి, కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) గెజిట్‌లో సాంకేతిక కారణాల వల్ల గుర్తింపు ఉన్న ప్రాజెక్టుల జాబితాలో వెలిగొండ లేకపోవడం వంటి అంశాలపై తెలుగుదేశం, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్న తరుణంలో.. ఈ రోజు వైఎస్సార్‌ ఆసరా పథకం రెండో విడత అమలు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, నీళ్లు విడుదలపై ప్రకటన చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన సొరంగాల తవ్వకం పనులను వేగవంతం చేయడంతో.. మొదటి టెన్నల్‌ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టులో మొదటి టెన్నల్‌ ద్వారా శ్రీశైలం ద్వారా వెలింగొండకు నీళ్లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఆగస్టులో కృష్ణా నదికి వరదలు వస్తాయి. ఆ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది కాబట్టి.. వరద సీజన్‌లో వెలిగొండకు జలాలు తరలించేందుకు జగన్‌సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఇక రెండో టెన్నల్‌ పనులు జరుగుతున్నాయి. దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులలో ఇప్పటికి 11 కిలోమీటర్ల మేర తొవ్వారు. ఇంకా ఏడు కిలోమీటర్లు తొవ్వాల్సి ఉంది. రెండో సొరంగం పూర్తి చేయడంపై కూడా జగన్‌ ఒంగోలు సభలో ప్రకటన చేశారు. 2023 ఫిబ్రవరి నాటికి రెండో సొరంగం పనులు కూడా పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వైఎస్‌ హాయంలోనే సొరంగాల తవ్వకాల పనులు మొదలయ్యాయి. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పూర్తిపై 2016 నుంచి 2018 వరకు ఐదుసార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలయ్యాయి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పూర్తిపై చిత్తశుద్ధి చూపించని టీడీపీ.. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోంది. ఆ పార్టీ నేతలు ఇటీవల మార్కాపురంలో మూడు రోజుల దీక్షలు చేశారు. జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తరచూ సీఎంకు లేఖలు రాస్తున్నారు. తామేమీ తక్కువన్నట్లుగా..బీజేపీ కూడా వెలిగొండ పూర్తి చేయడంపై రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు.. వెలిగొండను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈ రోజు మార్కాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసేలా ప్రాజెక్టు పూర్తిపై ప్రకటన చేసిన జగన్‌.. తన తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్టును తాను పూర్తి చేస్తాననే కృతనిశ్చయంతో ఉన్నారు.

Also Read : కొత్త ట్రెండ్‌ను సృష్టించిన వైఎస్‌ జగన్‌

Show comments