ఉదయనిధిని చిన్నపిల్లాడ్ని చేసి వెంటాడుతున్నారు : కమల్ హాసన్

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయి అందరికీ తెలుసు. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు, బీజెపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అయోధ్య స్వామిజీ ఉదయనిధి స్టాలిన్ తలపై తొలుత రూ. 10 కోట్లు, ఆ తర్వాత రూ.20 కోట్ల రివార్డు ప్రకటించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు డీఎంకే నేత ఉదయనిధి. అయితే ఉదయనిధికి ఆయన తండ్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మద్దుతుగా నిలిచారు. కోలీవుడ్ ప్రముఖులు సైతం నటుడు కం రాజకీయ నేతైన ఉదయనిధికి అండగా నిలబడ్డారు. తాజాగా ఈ అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కగా.. ఈ వ్యాఖ్యలు చేసిన ఉదయనిధితో పాటు పలువురికి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సీనియర్ నటుడు, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. సనాతన్ గురించి మాట్లాడినందుకు ఓ చిన్న పిలవాడ్ని (ఉదయనిధి)ను వెంటాడుతున్నారని వెనకేసుకు వచ్చారు.

పెరియార్ వల్లే సనాతన ధర్మం అనే పదం అందరికీ తెలిసిందని, పెరియార్ తమ సొంతమని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పుకోదని అన్నారు. ఆయన అందరి వాడని పేర్కొన్నారు. పెరియార్ ఒకప్పుడు గుడిలో పనిచేసేవారని, పూజలు చేసే ఆయన వాటిని విడిచిపెట్టి సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చునని అన్నారు. డీఎంకే గానీ, మరే ఇతర పార్టీ గాని పెరియార్‌ను తమ సొంతమని చెప్పుకోవని అన్నారు. గతంలో కూడా సనాతన ధర్మంపై చాలా మంది మాట్లాడారని, అయితే ఉదయనిధిని మాత్రం ఉద్దేశపూర్వకంగా వెంటాడుతున్నారని అన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఆ వ్యాఖ్యలను విభేదించి, రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొడుతూ.. హింస, చట్టపరమైన బెదిరింపు వ్యూహాలను ఆశ్రయించే బదులు, సనాతన ధర్మం ఆవశ్యకతపై చర్చల్లో పాల్గొనాలని సూచించారు.

Show comments