కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేడే, మేడం కరుణించేనా?

కేంద్ర బడ్జెట్ కి అంతా సిద్ధమయ్యింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8వ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడో బడ్జెట్ ని పార్లమెంట్ ముందుంచబోతున్నారు. ఈసారి బడ్జెట్ మీద ప్రజల్లో పలు ఆశలు చిగురుస్తున్నాయి. ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా ఊరట దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 2020-21 బడ్జెట్ లో దేశ జీడీపీ మైనస్ 7 శాతం పైగా నష్టపోవడంతో రాబోయే ఆర్థిక సంవత్సరం అద్భుతంగా ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు. ఐఎంఎఫ్ సహా పలు సంస్థలు ఏకంగా 11 శాతం వృద్ధి రేటుని లెక్కలేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో వాటి ఫలితాలు సామాన్యులకు చేర్చేలా కేంద్రం పలు రాయితీలు కల్పించాలని ఆశిస్తున్నారు.

కరోనా కారణంగా కకావికలం అయిన వ్యవస్థకు ఈ ఏడాది వ్యాక్సిన్ ఉపశమనం కల్పించబోతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ మొదటి దశ సాగుతోంది. ఈ నేపథ్యంలో రోగానికి వ్యాక్సినేషన్ మాదిరిగా ఆర్థిక వ్యవస్థకు కూడా నిర్మలమ్మ బడ్జెట్ లో ఊరట దక్కాలని భావిస్తున్నారు. దేశంలో అనేక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చివరకు బ్యాంకింగ్ రంగంలోనే సంక్షోభం చుట్టుముడుతోంది. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. రైతాంగం రోడ్డెక్కి ఆందోళనలో ఉన్నారు. వేతన జీవులకు కరోనా కారణంగా వేసిన వేతనాల కోత నుంచి పూర్తిగా కోలుకోలేదు. చిరువ్యాపారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు కేంద్రం అందించిన ప్యాకేజీ పూర్తిగా ఫలితాన్నివ్వడం లేదు.

ఆర్థికరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న తరుణంలో భవిష్యత్ పై గంపెడాశలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో ఈసారి కరోనా ట్యాక్స్ పేరుతో కొత్తగా పన్నుల భారం వేస్తారా లేక ఆదాయపన్నులో భారీగా రాయితీలు ఇవ్వబోతున్నారన్న ప్రచారం నిజం చేస్తారా అనే చర్చ సాగుతోంది. పలువురు ఆర్థిక వేత్తలు కేంద్రం ప్రజలకు మరింత అనుకూలంగా నిర్ణయాలుండాలని సూచిస్తున్నారు. నేరుగా ప్రజలకు నగదు పంపిణీ అత్యవసరం అంటున్నారు. చివరకు అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కూడా భారీగా నగదు ప్రతీ ఒక్కరి ఖాతాలో జమచేసేందుకు పూనుకుంది. ఈ తరుణంలో మోడీ సర్కారు కూడా ప్రజలపై ప్రభుత్వ వ్యయం పెంచాలనే సూచనలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఉద్యోగకల్పనపై కేంద్రీకరించడం, గ్రామీణాభివృద్ధి, అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు వంటివాటిపై మోడీ బడ్జెట్ సానుకూలంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. కరోనా తాకిడి నుంచి కోలుకుని తిరిగి పట్టాలెక్కేలా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బడ్జెట్ కావడంతో ఇది కీలకంగా మారుతోంది.

ప్రతీ సారీ ఊరించి, ఉసూరుమనిపించేలా ఆదాయపన్ను వ్యవహారం ఉంటుంది. ఈసారి కూడా ఆదాయపన్ను పరిమితి పెంపు ఉండకపోవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. గృహరుణ వడ్డీలపై పన్ను రాయితీ మొత్తాన్ని పెంచబోతున్నట్టు చెబుతున్నారు. టీకా కోసం బడ్జెట్ లో భారీగా కేటాయింపులుంటాయని చెబుతున్నారు. అదే సమయంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేయబోతున్నట్టు ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ జాబితాలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటితో పాటుగా వైజాగ్ స్టీల్ కూడా ఉంటుందనే అభిప్రాయం ఉంది.

ప్రజల చేతుల్లోకి పెద్ద ఎత్తున డబ్బు చేర్చడం కోసం.. ‘నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌’ కార్యక్రమానికి నిధుల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలపై ఆగ్రహంగా ఉన్న రైతులను శాంతింపజేసేందుకు ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట ఇస్తున్న మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఉండే బడ్జెట్ గా భావిస్తున్నారు. మరి నిర్మలమ్మ మూడో బడ్జెట్ లో ఎవరికి ఎంత మేలు చేస్తుందో చూడాలి. ఏపీకి సంబంధించిన సుదీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చేందుకు ఏమేరకు నిధులు ప్రకటిస్తారన్నది కూడా ఆసక్తికరమే.

Show comments