గుత్తా కోరిక నెర‌వేరేదెన్న‌డో..?

సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లు షికార్లు చేయడంపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. కొందరు తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వార్తల్ని ఎవరూ నమ్మొద్దని ఆయన అన్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. నిప్పు లేనిదే పొగ రాద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు కార‌ణం.. ఇటీవల అధికార పార్టీపై చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఎంపీగా చేసినా, ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించినా రాజ‌కీయంగా ఆయ‌న‌కు తీర‌ని కోరిక ఉండిపోయిన‌ట్లుగా అనుచ‌ర వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది. తొలుత.. టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన.. గుత్తా సుఖేందర్.. 1999లో తొలిసారి ఎంపీ అయ్యారు. నల్లగొండ.. పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన ఆయన.. తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009 నాటికి అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి.. పిలుపుతో.. టీడీపీని వదిలేసి.. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయన నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి 2009 2014లో కూడా కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించారు. అయితే.. గుత్తాకు ఉన్న కోరిక మాత్రం నెరవేరలేదు. మంత్రి పదవి దక్కించుకుని చక్రం తిప్పాలని అనుకున్నారు.

Also Read : వంగ‌వీటి.. ప‌వ‌న్ తో జ‌త క‌ట్ట‌నున్నారా?

ఈ నేపథ్యంలో 2014లో ఎంపీగా ఉంటూనే.. ఆయన టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. గత ఎన్నికలకు ముందు ఆయనకు టీఆర్ ఎస్ అధినేత.. కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా.. ఎమ్మెల్సీని చేశారు. అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమాఖ్య సమన్వయ సమితి కార్పొరేషన్ను ఏర్పాటు చేసి.. దానికి గుత్తాను చైర్మన్గా నియమించారు. కేవలం గుత్తా కోసమే.. ఈ పదవిని సృష్టించారనే విమర్శలు వచ్చినా.. కేసీఆర్ వెనక్కి తగ్గలేదు.కట్ చేస్తే.. ఈ ఏడాది జూన్ నాటికి ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి అయింది. దీంతో ఆయన ఆ పదవిని వదులుకున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.

దీనికి కారణం.. ఇన్ని పార్టీలు మారినా.. తన కోరిక నెరవేరక పోవడమేనని అంటున్నారు పరిశీలకులు. మంత్రి పదవి దక్కించుకునేందుకు గుత్తా.. అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ.. గుత్తాను ఎవరూ పట్టించుకోలేదు. దీనికి కూడా కారణం ఉంది.. రాజకీయ జిల్లాగా పేరున్న నల్గొండ.. అన్ని పార్టీలకూ.. బలమైన నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గం విషయంలో గుత్తా కోరిక నెరవేరలేదు. ఇక ఇప్పడైనా.. తన ప్రయత్నాన్ని ముమ్మరం చేయాలని భావించిన..గుత్తా.. అధికార పార్టీపై నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. వాస్తవానికి తన ఎమ్మెల్సీ కాలం ఈ ఏడాది పూర్తయిన నేపథ్యంలో తిరిగి దీనిని రెన్యువల్ చేయించుకుని.. మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆయన ముమ్మర ప్రయ‌త్నాలు చేస్తున్నారని, ఆ క్ర‌మంలోనే అధినేత దృష్టిలో ప‌డేందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మరి గుత్తా వ్యూహం ఫలిస్తుందా లేదా చూడాలి.

Also Read : బీజేపీని ఖాళీ చేస్తామంటున్న మంత్రి

Show comments