కనిగిరి వైసిపి నేత టీడీపీలో చేరిక.. బాబు వక్ర భాష్యం

విషయం ఏదైనా సరే రాజకీయంగా తనకు అనుకూలంగా. ప్రత్యర్థికి వ్యతిరేకంగా చెప్పుకోవడంలో చంద్రబాబుకు సాటి మరొకరు రారని అంటుంటారు. అది నిజమేనని పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి చంద్రబాబు తన మార్క్‌ రాజకీయ ప్రచారాన్ని చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలానికి చెందిన వైసీపీ నేత, ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బొల్లా మల్యాద్రి చౌదరి నియోజకవర్గ ఇంఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సమయంలో మాల్యాద్రి చౌదరి వెంట ఆయన గ్రామస్తులు, స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘ ఇప్పుడు టీడీపీలో చేరిన వారంతా గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారే. వాస్తవాలు గ్రహించి వైసీపీని వీడారు. చేరిన వారిలో ఎస్సీ, బీసీ వర్గాల వారే అధికంగా ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాను’’ అని చంద్రబాబు బొల్లా మాల్యాద్రి చౌదరి చేరికకు తనదైన భాష్యం చెప్పారు. చంద్రబాబు మాటలు విన్న వారికి.. అవును నిజమేనని అనిపించకమానదు. కానీ కనిగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందులో వాస్తవాలు ఏమిటో తెలుసు. అయినా.. ఒక్క నియోజకవర్గం వారు ఏమనుకుంటే ఏమీ మిగతా 174 నియోజకవర్గాల్లోని ప్రజలకు తాను చెబుతున్నది అవాస్తవాలు అని తెలియదు కదా..? అనేదే చంద్రబాబు ధైర్యం కాబోలు… వాస్తవం ఏమైనా.. తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు.

చంద్రబాబు ఒక విషయం నిజం చెప్పారు. ఇప్పుడు టీడీపీలో చేరిన బొల్లా మాల్యాద్రి చౌదరి, ఆయన వెంట వెళ్లిన గ్రామస్తులు గతంలో వైసీపీకి ఓటు వేసిన వారే. అంతేకానీ.. చేరిన వారిలో ఎస్సీలు, బీసీలే అధికం అన్న మాట అవాస్తవం. పైగా.. వాస్తవాలు గ్రహించి బొల్లా మాల్యాద్రి చౌదరి వైసీపీని వీడలేదు. ఎంపీపీ పదవి ఆశించగా.. అది కాస్త జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. సొంత గ్రామం లక్ష్మీనరాసాపురం ఎంపీటీసీ జనరల్‌లోకి వెళ్లింది. వైసీపీ తరఫున బొల్లా మల్యాద్రి చౌదరి తనయుడు నరసింహారావు పోటీ చేసి గెలిచారు. అటు ఎంపీపీ పదవి దక్కే అవకాశం లేకపోవడంతో పాటు స్థానికంగా బొల్లా మాల్యాద్రి చౌదరి పెత్తనానికి బ్రేక్‌ పడింది. మండలంలో పెత్తనం అంతా పామూరు పట్టణానికి చెందిన జి.హుస్సేన్‌ రెడ్డి చేతిలోకి వెళ్లిపోయింది. ఎంపీపీ పదవి హుస్సేన్‌ రెడ్డి సతీమణి లక్ష్మీకి వరించింది. దీంతో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఏడాదిన్నరగా అలకపాన్ను ఎక్కారు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం మానేశారు.

గతంలో మల్యాద్రి చౌదరి టీడీపీలో ఉండేవారు. అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడుగా పని చేశారు. కేవలం ఎంపీపీ పదవి ఇవ్వలేదనే కారణంతోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం తనకు నచ్చిన రీతిలో మాట్లాడేశారు. బొల్లా మల్యాద్రి చౌదరి పార్టీలో చేరితే.. ఆయన పేరు వదిలేసి.. ఎస్సీలు, బీసీలు ఎక్కువగా చేరారని చెబుతూ.. ఇది వైసీపీకి పెద్ద దెబ్బనేలా మాట్లాడి తన మార్క్‌ను చూపించారు.

Also Read : పట్టాభి నోటి దురుసు.. వనమాడికి తలనొప్పులు

Show comments