బాలకృష్ణ కాదు.. ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు!

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆరో సీజన్ ముగిసిందో లేదో అప్పుడే ఏడో సీజన్ కి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఆరో సీజన్ ముగింపు దశలో ఉన్నప్పుడే.. వచ్చే సీజన్ నుంచి నాగార్జున ఆ షో హోస్ట్ గా తప్పుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్-7 హోస్ట్ గా బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు ఆయన ఈ షో కోసం ఏకంగా రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగింది. అయితే బాలకృష్ణ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. ఇంతవరకు బిగ్ బాస్ టీమ్ తో ఎటువంటి చర్చలు జరగలేదని అంటున్నాయి.

బిగ్ బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేశాడు. ఏవో కారణాల వల్ల ఏడో సీజన్ హోస్ట్ చేయలేనని షో నిర్వాహకులతో చెప్పినట్లు టాక్. అప్పటినుంచి బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అయితే షో నిర్వాహకుల పరిశీలనలో బాలకృష్ణ పేరయితే ఉంది కానీ ఇంకా ఆయనను సంప్రదించలేదని తెలుస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ పేరుతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. తన అద్భుతమైన హోస్టింగ్ తో మొదటి సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేశాడు. రెండో సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయట్లేదని తెలిసి.. అప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఇప్పటికీ బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ రావాలని కోరుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే బిగ్ బాస్ టీమ్ ఏడో సీజన్ కోసం ఎలాగైనా ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని చూస్తోందట. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. టీవీ షో కోసం సమయం కేటాయించడం అనుమానమే. అయినప్పటికీ షో నిర్వాహకులు మాత్రం ఎన్టీఆర్ ని రప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఒప్పుకోని పక్షంలో అప్పుడు బాలకృష్ణ, రానా పేర్లు పరిశీలించాలని చూస్తున్నారట. మరి వీరిలో బిగ్ బాస్-7 హోస్ట్ గా ఎవరు రంగంలోకి దిగుతారో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.

Show comments