Idream media
Idream media
బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం సాధించింది. ఊహించినట్లుగానే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు ఇక్కడ భారీ మెజారిటీ దక్కింది. డాక్టర్ సుధ తన సమీప బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,211 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ ఆధిక్యం సాధించారు. సమీప బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఆమె అందనంత దూరంలో నిలిచారు.
గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య గెలిచారు. వైసీపీ తరఫున ఆయన 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. ఆయన సతీమణికే వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యకు వచ్చిన మెజారిటీ కన్నా.. రెట్టింపు ఆధిక్యంతో డాక్టర్ సుధ విజయం సాధించడం విశేషం.
బద్వేల్ ఉప ఎన్నికల్లో ముందు అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. జనసేన పార్టీ మద్ధతుతో బీజేపీ పోటీ చేసింది. ఆ పార్టీ తరఫున పనతల సురేష్ బరిలోకి దిగారు. ఆయనకు 21,638 ఓట్ల వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేశారు. ఆమెకు 6,223 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇద్దరూ డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 1.46 లక్షల ఓట్లు పోలవగా.. అందులో ఆరో వంతు తెచ్చుకుంటేనే డిపాజిట్ దక్కుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ డిపాజిట్ మార్క్‌ను అందుకోలేకపోయాయి.