Raghunandan Rao Warn YCP – ఇది బాబు రకం బెదిరింపా రఘునందన్‌ రావు..?

అదృష్టం వల్లనో లేదా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్లక్ష్యంగా ఉండడం వల్లనో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేత రఘనందన్‌రావు అనుకోకుండా వచ్చిన ఎమ్మెల్యే పదవితో తన అహంకారాన్ని చూపిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీలో గుర్తింపు కోసం ఇతర నేతలతో పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కావడంతో ఆయన తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌ రావు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దూకుడు రాజకీయాలు చేసే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోటీ పడుతున్న రఘునందన్‌ రావు బొక్కబోర్లా పడుతున్నారు.

తాజాగా వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌ తరఫున ప్రచారానికి వచ్చిన రఘునందన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బెదిరించే తరహాలో ఆయన అధికార పార్టీపై విమర్శలు చేశారు. బద్వేలులో వైసీపీకి, బీజేపీ హోరాహోరీ పోరు సాగుతోందనే కలరింగ్‌ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్న బీజేపీ నేతలు తమ పార్టీ నేతలను బెదిరిస్తున్నారని, ఏజెంట్లుగా కూడా కూర్చొనీయకుండా కేసులు పెడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ బాటలో మరో అడుగు ముందుకు వేశారు రఘునందన్‌రావు. అధికార వైసీపీ నేతలు తమ పార్టీ నేతలను కిడ్నాప్‌ చేసి, వారి పార్టీలో చేర్చుకుంటున్నారంటూ హాస్యాస్పదమైన విమర్శలు చేశారు. ’వైసీపీకి 13 జిల్లాల పోలీసులు మాత్రమే ఉన్నారు. మా వద్ద స్పెషల్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, 30 రకాల పోలీసులు ఉన్నారు. “జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుపెట్టుకో,బెదిరిస్తే భయపడేవారు ఎవరూలేరిక్కడ..’’ అంటూ రఘునందన్‌ రావు తన నోటికి పని చెప్పారు.

Also Read : TDP Elections Boycott -మునిసిపోల్స్ ని కూడా టీడీపీ బాయ్ కాట్ చేస్తుందా, ఇరకాటంలో అధిష్టానం

రఘునందన్‌ రావు బెదిరింపుల తీరు ఒకప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును తలపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు  తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ ఓటును కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తూ ఆడియో,వీడియో ఆధారాలతో సహా దొరికిపోయారు. దీనిపై బాబుపై కేసు నమోదైంది. ఆయన్ను అరెస్ట్‌ చేస్తారేమోనన్న ప్రచారం సాగిన నేపథ్యంలో ఓ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘‘ నీకు పోలీసులున్నారు,నాకు పోలీసులున్నారు. నీకు ఏసీబీ ఉంది,నాకు ఏసీబీ ఉంది  ఖబడ్దార్‌ కేసీఆర్‌ ’’ అంటూ చంద్రబాబు బెదిరించారు. ఇప్పుడు రఘనందన్‌ రావు చేసిన వ్యాఖ్యలు కూడా నాడు బాబు చేసిన వ్యాఖ్యలు మాదిరిగానే ఉన్నాయి.

బద్వేలులో ఎవరిసత్తా ఏమిటో అందరికి తెలిసిందే. అయినా బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఫలితం ఏమీ మారదు. ప్రజలకు తాము ఏమి చేస్తామో చెప్పడం వల్ల మాత్రమే వారి మనసులను గెలుసుకోవచ్చు. పెట్రోలు, డీజీల్, గ్యాస్‌ ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని హేళన చేసిన రఘునందన్‌ రావు బీజేపీకి పెద్ద నష్టం చేకూర్చారు. లేకపోతే బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని ఆ పార్టీ నేతలే అంగీకరించారు. ఇలాంటి నోటి దురుసు నేతను తీసుకొచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయిస్తే  ఉన్న ఓట్లకు కూడా గండిపడే అవకాశం లేకపోలేదు.

Also Read : Badvel By Polls -బద్వేలు ఉప ఎన్నికలు, మెజార్టీపై మొదలయిన పందాలు

Show comments