టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై ప్రివిలేజ్ యాక్షన్ త‌ప్ప‌దా ?

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ పై తొందరలోనే సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారా ? ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం పై కూన అనేక సందర్భాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడారట. దీంతో కూనపై యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

స్పీకర్ ఫిర్యాదుతో కూన చేసిన ఆరోపణలు మాట్లాడిన ఆడియో వీడియోలను కమిటి పరిశీలించింది. స్పీకర్ పై ఉద్దేశ్యపూర్వకంగానే కూన అభ్యంతరకరంగా మాట్లాడారని నిర్ధారణకు వచ్చిన కమిటీ విచారణకు రమ్మని మాజీ ఎంఎల్ఏకి నోటీసిచ్చింది. అయితే ఈ నోటీసును కూన ఏమాత్రం లెక్క చేయలేదు. కమిటీ ఇచ్చిన నోటీసును పట్టించుకోకపోవటం అంటే ధిక్కరణ కిందే పరిగణిస్తున్నట్లు కాకాణి చెప్పారు.

కాకాణి చెప్పింది చూస్తుంటే కూనపై చర్యలు తీసుకోవాలని చెబుతు తొందరలోనే స్పీకర్ కు సిఫారసు చేయబోతున్నట్లు అర్ధమైపోతోంది. మరపుడు స్పీకర్ ఏమి చేస్తారో చూడాలి. అలాగే ఎంఎల్ఏ అచ్చెన్నాయుడు వ్యవహారం కూడా కమిటీ పరిశీలించింది. వివిధ కారణాలతో అచ్చెన్నను కూడా కమిటీ విచారణకు ఈనెల 14న హాజరుకావాలంటూ నోటీసిచ్చింది. ఈయనతో పాటు రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని కూడా కమిటీ పరిశీలించినట్లు చెప్పారు.

మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై నిమ్మగడ్డ కమిషనర్ గా ఉన్న కాలంలో గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో మంత్రులిద్దరూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు నోటీసిచ్చింది కమిటి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని. అయితే రెండు సార్లు నిమ్మగడ్డ ఏదో కారణం చెప్పి విచారణకు హాజరుకాలేదట. ఫైనల్ గా మరో నోటీసిచ్చిన తర్వాత నిమ్మగడ్డ ఎలా రియాక్టవుతారో చూసి తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేస్తామని కాకాణి స్పష్టంచేశారు. అంటే అచ్చెన్న నిమ్మగడ్డ వ్యవహారాలను పక్కన పెట్టేసినా వీలైనంత తొందరలో కూనపైన యాక్షన్ కు కమిటీ సిఫారసు చేయబోతోందని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Show comments