రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తెరాస కీలక నాయకులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. పార్టీలో అసంతృప్తి ఉన్న ప్రతి నాయకులతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కొంతమంది నాయకులు ఆయనను పక్కన పెట్టడం తో ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయంగా పార్టీలో కొంతమంది బలంగా ఉండటంతో రేవంత్ రెడ్డి మాటలు పెద్దగా లెక్క చేయడం లేదనే ప్రచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఆదేశించినా సరే కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులను గట్టిగా టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే ఉమ్మడి నల్గొండ అలాగే మహబూబ్నగర్ తో పాటుగా మెదక్ జిల్లాలకు సంబంధించిన కొంత మంది టిఆర్ఎస్ నాయకులను ఆయన టార్గెట్ చేశారని వాళ్లకు పార్టీలోకి వస్తే ఏం చేస్తాను ఏంటనే దానిపై ఆయన గట్టిగా హామీ ఇచ్చారని అంటున్నారు. పార్టీలో ఎటువంటి అన్యాయం జరిగే అవకాశం లేదని కాబట్టి మీరు పార్టీలోకి వస్తే కచ్చితంగా పార్టీ బలోపేతం కావడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మీరు అడిగింది ఇస్తాను అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలు అదే విధంగా కొంతమంది మాజీ మంత్రులు ఇద్దరు మాజీ ఎంపీ లతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని కూడా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో కూడా రేవంత్ చర్చలు జరిపారని అలాగే వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావించిన వాళ్లను కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి వాళ్లకు సీటు ఇప్పుడే ఖరారు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని అంటున్నారు. అది హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు ముషీరాబాద్ నియోజకవర్గ నేత శ్రీనివాసరెడ్డితో కూడా ఆయన చర్చలు జరిపారని సమాచారం.

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ నేతలను రేవంత్ రెడ్డి బాగా టార్గెట్ చేశారని కూడా ప్రచారం మొదలైంది. పార్టీలోకి రావడానికి భయపడే వాళ్లకు భవిష్యత్ పై ఆయన హామీ ఇస్తున్నారని అధికార పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే అవసరం లేదని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తాను చూసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అంటున్నారు. దానం నాగేందర్ తో కూడా గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారని ప్రచారం మొదలైంది.

Also Read : Huzurabad By Poll -హుజూరాబాద్ : ఫ‌స్ట్ ప్లేస్ లో బీజేపీ.. లాస్ట్ లో టీఆర్ఎస్..!

రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టినా సరే ముందు నేను నిలబడతాననే హామీని రేవంత్ రెడ్డి ఇవ్వగలిగారు అని కూడా అంటున్నారు. కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బెదిరించిన కేసులు పెట్టిన సరే తనకు ఏవిధంగా ముందుకు వెళ్లాలో ఒక స్పష్టత ఉందని అలాగే తనను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకునే విషయంలో కూడా తాను క్లారిటీగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి కొంతమంది నాయకుల వద్ద చెప్పారట. డిసెంబర్ 9న రాహుల్ గాంధీ తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో దాదాపుగా 12మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

ఒక టిఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపి జితేందర్రెడ్డి పేరు కూడా వినపడుతుంది. ఆయనతో పాటుగా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. టిడిపిలో ఒకప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లను రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని రావుల చంద్రశేఖర్రెడ్డితో మాట్లాడారు అని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పదవులు లేని మాధవ రెడ్డి కుటుంబం అలాగే… ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొందరు నాయకులను రేవంత్ బాగా టార్గెట్ చేశారని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను రేవంత్ రెడ్డి గట్టిగా టార్గెట్ చేశారు అనే చర్చ జరుగుతోంది. మరి డిసెంబర్ 9న ఎవరు పార్టీ మారబోతున్నారు ఏంటి అనేది చూడాలి.

అయితే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రతి నాయకుడు కూడా క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులేనని ప్రజల్లో ఆదరణ తో పాటు సామాజిక వర్గాల లెక్కలు కూడా చూసుకుని బలంగా ఉన్న నాయకులను ఆయన టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రజల్లో కాస్తో కూస్తో గుర్తింపు ఉండటమే కాకుండా పోటీ చేస్తే గెలుస్తాం అని అనుకునే వాళ్లను కూడా రేవంత్ టార్గెట్ చేశారని… అలాగే టీఆర్ఎస్ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డ వాళ్లను భారతీయ జనతా పార్టీలో పదవులు వస్తాయని ఎదురుచూస్తున్నా వాళ్లను కూడా టార్గెట్ చేసి అవసరమైతే తక్షణమే వాళ్లకు నియోజకవర్గాలను కేటాయించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అంటున్నారు.

Also Read : Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

Show comments