ఏకగ్రీవాల మీద వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ..

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో మొదటి నుంచి ఎప్పుడు ఎక్కడా లేనివిధంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు జిల్లాలో ఏకగ్రీవమైన వాటిని పెండింగ్‌లో పెట్టాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలో ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయనే కారణాన్ని చూపుతూ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏకగ్రీవాలను పెడింగ్‌లో పెట్టాలని ఆదేశించి మరో వివాదానికి తెరలేపారు. అయితే నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పు పెట్టింది. నిమ్మగాడ్డ తన పరిధి దాటి నియంత పోకడలు పోతున్నారని విమర్శించింది.

అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలకు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్టు ఆయన ప్రకటించారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అయితే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. గోపాలకృష్ణ ద్వివేది మీడియా సమావేశం ముగిసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ ప్రకటన విడుదల చేశారు.

పంచాయతీల డిక్లరేషన్‌ను తాత్కాలికంగా ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి నిమ్మగడ్డపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతోనూ మాట్లాడనీయోద్దంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఇంతటి వివాదానికి కారణమైంది. తాజాగా దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేలా ఏకగ్రీవాలకు ఎస్‌ఈసీ పచ్చజెండా ఊపింది.

Show comments