Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు.. ఎక్కడో మూల బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి పట్ల ఎవరో అనుచితంగా ప్రవర్తిస్తే దానిని ప్రభుత్వానికి ఆపాదిస్తూ కుల రాజకీయాలు.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల కు చెందిన ఆస్తులు లేదా వ్యక్తులపై అనుమానాస్పదంగా ఏదైనా జరిగితే మత రాజకీయాలకు దిగుతున్నాయి. తప్పు జరిగితే అది ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ప్రభుత్వం ఆ పని ఎప్పటికప్పుడు వెనువెంటనే చేస్తోంది కూడా. ఒకవేళ ఆలస్యమైతే ప్రభుత్వాన్నికూడా నిలదీయవచ్చు. తప్పు లేదు. కానీ.. రాజకీయ లబ్ది కోసం అల్లర్లు సృష్టించడం తగదు. ముఖ్యంగా అంతర్వేదిలాంటి ఘటనలను అడ్డం పెట్టుకుని రాజకీయాలకు దిగడం భావ్యం కాదు. ఈ ఘటనపై ప్రభుత్వ చర్యలను ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు ప్రశంసిస్తున్నారు. అయినప్పటికీ కొందరు తమ సొంత లాభం కోసం వివాదానికి ఆజ్యం పోస్తున్నారు.
వాస్తవాలను పరిశీలిస్తే…
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 5 అర్ధరాత్రి దాటాక ఆలయ రధం దగ్ధమయింది. కారణాలేంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడక మానవు కూడా!. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. దీన్ని దురదృష్టకర, అవాంఛనీయమైన ఘటనగా వర్ణించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా ఆ పుణ్యక్షేత్రంలోని సంఘటనలకు బాధ్యుడైన ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెప్పేచర్యలు. ఎక్కడా తాత్సారానికి తావులేకుండా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం… విచారణలో దోషులెవరో తేలితే కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవుతోంది.
కుట్రలు తగవు..
మొదటి నుంచీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం ముందే న్యాయ సమీక్షకు పంపించటమనేది చరిత్రాత్మకం. ఇటీవల టీటీడీ జమా ఖర్చుల్ని కాగ్ ఆడిట్ పరిధిలోకి తేవాలనుకోవటమూ మున్నెన్నడూ చూడనిదే. ఈ చిత్తశుద్ధే కొన్ని రాజకీయ పక్షాలకు మింగుడుపడటం లేదు. ఏ సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేస్తూ… ప్రభుత్వానికి పూస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాయి. తమ కుట్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రులను అడ్డుకుని రచ్చకు ప్రయత్నించటం… అదే వ్యక్తులు అక్కడికి కొద్ది దూరంలోని వేరొక మతానికి చెందిన ప్రార్థన మందిరంపై రాళ్లు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం ఈ కుట్రను స్పష్టంగా బయటపెట్టేవే.
ఈ విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించేవారికి కలిగే సందేహమొక్కటే? ఇలాంటి చర్యల ద్వారా వీళ్లు సాధించాలనుకుంటున్నదేంటి? ఏం చేయాలని రాళ్లేశారు? అసలిలా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంతలా దిగజారుతారా? ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ధర్మమేనా? ఇది ప్రభుత్వ ధర్మాగ్రహం. విచారణలో బయటపడే దోషులు… మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్న కుట్రదారులు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే అనుకోవాలి!
జగన్ సాహసోపేత నిర్ణయం : విశాఖ శారదా పీఠాధిపతి
అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనకు సంబంధించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్వాగతించారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. సీబీఐ విచారణ ద్వారా అంతర్వేది ఘటన వెనుక ఉన్న అసలు కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందని చెప్పారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని సి.బి.ఐ నిగ్గు తేలుస్తుందన్నారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తయితే… దాన్ని తలదన్నే విధంగా ప్రస్తుతం అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించడం హిందువులందరూ హర్షించదగ్గ విషయమని స్వామి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. హిందూధర్మ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం అభినందనీయమని చెప్పారు.