Idream media
Idream media
రాష్ట్రంలోని పేదలందరికీ సొంత నివాసం ఉండాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకాన్ని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసి ఉత్తర్వులపై జగన్ సర్కార్ డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇళ్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నాం.. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రాష్ట్ర, కేంద్ర మార్గదర్శకాలతో ఈ రోజు ఉదయం డివిజనల్ బెంచ్ ముందు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం వల్ల అగ్ని ప్రమాదాలు, తాగునీటి, ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ పేర్కొంటూ.. ఇళ్ల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిన్న శుక్రవారం సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఏపీ సర్కార్ వెంటనే స్పందించింది. పేదలకు సొంత గూడు కల్పించే ఈ బృహత్తర పథకం కొనసాగేలా.. చర్యలు చేపట్టింది.
ఏపీలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, సెంటు, సెంటున్నర స్థలంలో నిర్మించే ఇళ్లు నివాసయోగ్యం కాదంటూ 128 పిటిషన్లు ఏపీ హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారించిన హైకోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ.. ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ మూడు జీవోలలోని పలు నిబంధనలను కొట్టి వేస్తూ 108 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది.
గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన ఏపీలోని ఇళ్లు లేదా ఇళ్ల స్థలం లేని 30 లక్షల మంది పేదలకు పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పన జగన్ సర్కార్ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వాటికి పట్టాలు కూడా పంపిణీ చేసింది. ఆయా స్థలాల్లో రెండు దశల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్కసారిగా ఏపీలో ఇళ్ల స్థలం లేని పేదవాళ్లు అంటూ లేకుండా జగన్ తెచ్చిన నవరత్నాలు– అందరికీ ఇళ్లు పథకంతో ప్రతిపక్ష టీడీపీలో దడ మొదలైంది. అప్పట్లోనే ఇళ్ల స్థలాలు మంజూరు కాకుండా కోర్టుల్లో కేసులు వేసింది. ఆ తర్వాత సెంటు, సెంటున్నర స్థలాలు సరిపోవని, మూడు సెంట్లు చొప్పన ఇవ్వాలంటూ టీడీపీ నేతలు మీడియా ముందు హంగామా చేశారు. వారే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించి.. ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు సృష్టించారని వైసీపీ అనుమానిస్తోంది.
Also Read : పార్టీలన్నీ ఒకవైపు …. టిడిపి మరోవైపు ! బిజెపి అంటే భయమా భక్తా ?