ఏపీలో ఆరోగ్య ”మ‌స్తు”

ఆరోగ్యాన్ని మించిన ఐశ్వ‌ర్యం లేద‌న్న‌ది ఆర్యోక్తి. అది వాస్త‌వం కూడా. అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప్ర‌తీ పార్టీ కూడా ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తుంది. కొంద‌రు ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు. మ‌రికొంద‌రు అధికారంలోకి వ‌చ్చాక మూల‌న పెడ‌తారు. కానీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైద్య రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త ఆరోగ్య భ‌ద్ర‌త‌కు కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుండ‌డం ఇప్పుడు ప్ర‌త్యేక‌త‌గా నిలుస్తోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆరోగ్యం చెడిపోతే.. బాగు చేయ‌డానికి స‌రైన వైద్య వ్య‌వ‌స్థ అవ‌స‌రం. అటువంటి వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌న‌కు జ‌గ‌న్ స‌ర్కారు ఆది నుంచీ కృషి చేస్తూనే ఉంది. ప్ర‌ధానంగా పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య శ్రీ‌ని బ‌లోపేతం చేయ‌డ‌మే కాకుండా.. ప్ర‌తీ వ్య‌క్తికీ హెల్త్ కార్డు జారీ చేస్తోంది. తాజాగా క్యూఆర్‌ కోడ్‌తో ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్య వివరాలు రూపొందించాల‌ని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

హెల్త్ హ‌బ్స్

కొవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెడుతోంది. మెడికల్‌ కాలేజీల సంఖ్య‌ను పెంచుతోంది. హెల్త్‌ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ సీఎం జ‌గ‌న్ దిశా నిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదని జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా ప్ర‌భుత్వం వేగ‌వంతంగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. నిర్మాణానికి సంబంధించి ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారుల‌కు జగన్ సూచించారు. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలి ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్

ఫ్యామిలీ డాక్ట‌ర్ అనేది ఆర్థికంగా వెసులుబాటు ఉన్నోళ్ల‌కే ప‌రిమిత‌మైన ప‌దం. ఇప్పుడు పేద‌ల‌కు కూడా ఫ్యామిలీ డాక్ట‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు– నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు సీఎం. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

డిజిట‌ల్ హెల్త్

‘ఆరోగ్య శ్రీ’ ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచారు. హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంది ప్ర‌భుత్వం. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరుస్తోంది. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. జ‌గ‌న్ సూచ‌న మేర‌కు బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండేలా అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. ఇలా వినూత్న ప‌ద్ధ‌తుల్లో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు పాటు ప‌డుతోంది.

ఇత‌ర న‌గ‌రాల‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌స్తోంది..

గ‌త పాల‌కులు చేసిన త‌ప్పిదాల కార‌ణంగా వైద్యం అంటే.. ఇప్ప‌టికీ హైద‌రాబాద్ వైపు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితిపై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించిన జ‌గ‌న్ ఏపీవాసులు ఎవ‌రూ.. ‘ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు. స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై ఫోకస్ చేయండి.’ అని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. అలా ఇత‌ర న‌గ‌రాల‌కు వెళ్తున్న వారు ప్ర‌ధానంగా ఏ చికిత్స కోసం వెళ్తున్నారు.. దానికి సంబంధించిన చికిత్స‌ ఏపీలోనే అందుబాటులో ఉంచాలంటే ప్ర‌భుత్వ‌ప‌రంగా ఏం చేయాలి అనే అంశాల‌పై ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించి అంద‌జేయాల‌ని వైద్య శాఖ‌ను ఆదేశించారు. ఈ ఒక్క విష‌యం చాలు.. ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ఎంత‌లా ఆలోచిస్తున్నారో తెలియ‌జెప్పేందుకు.

Show comments