‘ప్రైవేటు’కు అడ్డుకట్ట పడేనా!

వైద్యం విషయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల వ్యవహారం వీటి భారిన పడ్డవాళ్ళకు పూర్తిగానే అవగతమవుతుంది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు చేపట్టినప్పటికీ వీరి పంథా ఏమాత్రం మారడం లేదన్నది ప్రజల నుంచి విన్పిస్తున్న ప్రధాన ఫిర్యాదు. అయితే తాజాగా వీరికి కరోనా రూపంలో మరో వ్యాపార అవకాశం దొరికేసింది. ఎటువంటి జంకూబొంకూ లేకుండా, నిబంధనల మాట పూర్తిగా పక్కన పెట్టేసి తమదైన రీతిలో దోపిడీకి తెరలేపారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పలు ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్‌ చికిత్సకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిని అవకాశంగా మల్చుకున్న పలు ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్య సంస్థలు దోపిడీకి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రమేష్‌ ఆసుపత్రి దుర్గటన కూడా. అయితే దీనిపై పూర్తిస్థాయిలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కోవిడ్‌ సెంటర్లను తనిఖీ చేసేందుకు నిర్ణయించింది. ఆ దిశగా చురుగ్గానే చర్యలు చేపడుతోంది.

మరో పక్క ప్రైవేటు ల్యాబొరేటరీలు కూడా తమదైన దోపిడీని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును రోగులను దోచుకునేందుకు ఆసరాగా చేసుకుంటున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తమ అనుమతి లేకుండా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లిఖార్జున హెచ్చరికలు జారీ చేసారు.

కోవిడ్‌ 19 వైద్య పరీక్షలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేటు లేబొరేటరీలు కాసులకోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రైవేటుగా టెస్టులు చేయించుకుంటున్న వారి వివరాలు ప్రభుత్వం వద్దకు చేరడం లేదు. అలాగే సదరు టెస్టులు చేయించుకుంటున్న వారు కూడా రహస్యంగా మందులు వాడుతూ జనజీవనంలో తిరిగేస్తున్నారు. దీంతో మరింత మందికి వైరస్‌ వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో విస్తృతంగా కేసులు పెరగడానికి ఇదే ప్రధాన కారణం అన్న భావన వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారంటే, పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు లేకుండా ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ల్యాబులు నిర్వహిస్తున్న టెస్టుల ప్రామాణికతపై అనేక అనుమాలను కూడా ఉన్నాయి. అయినప్పటికీ కరోనా రోగుల పట్ల సమాజంలో ఉన్న భావన నేపథ్యంలో పలువురు ఈ ప్రైవేటు ల్యాబ్‌లు చేసే టెస్టులపై ఆధారపడుతున్నారు. తద్వారా వారి ఆరోగ్యంతో పాటు, వారి కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతరుల ఆరోగ్యంపై కూడా తీవ్ర దుష్ప్రభావానికి కారణమవుతున్నాయి. అయితే ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడడం విమర్శలకు తావిస్తోంది.

ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం కల్గించడమే కాకుండా, ప్రభుత్వం ఉచితంగా చేస్తున్న యాంటీజెన్‌ పరీక్షలకు వివిధ ప్రాంతాల్లో రూ. 2వేల నుంచి 4వేల రూపాయల వరకు ప్రైవేటు ల్యాబుల్లో వసూలు చేస్తున్నారు. తద్వారా ఆర్ధికంగా కూడా దోపిడీకి తెరలేపుతున్నారు.

ఆరోగ్యశ్రీ సీఈవో ఉత్తర్వుల మేరకు ఎన్‌ఏబీఎల్, ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు ఉన్న ఆసుపత్రులు, ల్యాబుల్లో మాత్రమే కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ అనుమతి తీసుకుని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే పరీక్షా ఫలితాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరచాలి. ఈ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

Show comments