AP Cabinet Decisions – సామాజిక సంక్షేమం వైపు అడుగులు.. ఏపీ కేబినెట్‌ కీలక తీర్మానాలు

అన్ని కులాల్లోనూ ధనికులున్నారు. పేదలు ఉన్నారు. ఆయా కులాల్లో ఉన్న పేదలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి కులంలోని పేదలకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందేలా చూసేందుకు ఆయా కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న జగన్‌ సర్కార్‌ ఈ దశగా మరో అడుగు ముందుకు వేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొత్తగా జైన్, సిక్కు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది.

కొత్తగా ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ శాఖ..

జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు, కమ్మ, క్షత్రియ, రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో తాజాగా సిక్కు, జైన్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అగ్రవర్ణ కులాల్లోని పేదలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి. వారు ఆర్థికంగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు.

రెండు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో సరికొత్త నిర్ణయాన్ని కూడా ఏపీ కేబినెట్‌ తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ శాఖను ఏర్పాటు చేసేందుకు అవసరమైన తీర్మానానికి ఆమోదం తెలిపింది. అగ్రవర్ణ కులాల్లోని పేదల సంక్షేమం కోసం ఈ శాఖ పని చేయబోతోంది. బీసీలకు ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, కొత్త పథకాలు, విధాన నిర్ణయాలు తీసుకునేందుకు బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అమ్మ ఒడి పథకం – 75 శాతం హాజరు తప్పనిసరి..

వీటితోపాటు రాష్ట్రంలో మరో 4,035 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2021–2022 విద్యాసంవత్సరం నుంచి అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకునే తీర్మానానికి ఆమోదం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నూతనంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు తీర్మానం చేసింది. విశాఖ శారదా పీఠానికి భీమిలి నియోజకవర్గం కొత్తవలసలో 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read : Assembly Resolution – BC Census : బీసీ జ‌న‌ గ‌ణ‌న‌పై జగన్ సర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Show comments