Antim : అంతిమ్ రిపోర్ట్

చాలా గ్యాప్ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా అంతిమ్ థియేటర్లలో అడుగు పెట్టింది. గత నెల విడుదలైన సూర్యవంశీ కలెక్షన్ల పరంగా ఇచ్చిన హామీతో పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ధైర్యం చేస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చిందే అంతిమ్. తను సోలో హీరో కాకపోయినా సల్మాన్ ఖాన్ ఎక్కువసేపు ఉన్నాడన్న కారణాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్న టీమ్ దానికి తగ్గట్టే నిన్న మంచి వసూళ్లను దక్కించుకుంది. గత ఏడాది పీడకల లాంటి డిజాస్టర్ ని రాధే రూపంలో దక్కించుకున్న సల్మాన్ ఖాన్ దీంతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారనే నమ్మకం అభిమానుల్లో ఉంది. మరి అది నిలబడేలా సినిమా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

సఖారాం పాటిల్(సచిన్ కెద్కర్)తల్లి లాంటి తన భూమిని కార్పొరేట్ కబంధ హస్తాలకు బలి చేసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితికి వస్తాడు. దీన్ని తట్టుకోలేకపోయిన కొడుకు రాహుల్(ఆయుష్ శర్మ) సమాజంలో మంచిగా ఉంటే బ్రతకలేమని గుర్తించి పూణేలో ప్రసిద్ధ రౌడీ గ్యాంగ్ నన్యా భాయ్(ఉపేంద్ర లిమాయె)బృందంలో చేరిపోతాడు. అక్కడి నుంచి తానూ దుర్మార్గాల్లో భాగమవుతాడు. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు పోలీస్ ఆఫీసర్ రాజ్ వీర్(సల్మాన్ ఖాన్). ముల్లుని ముల్లుతోనే కొట్టాలనే సూత్రాన్ని అనుసరించి ముఠాల మధ్య తగాదాలు రేపి వాళ్లలో వాళ్ళు కొట్టుకునేలా చేస్తాడు. మరి రాహుల్ రాజ్ వీర్ ల మధ్య సంఘర్షణ ఎలా వచ్చిందన్నదే అసలు కథ

ఆర్టిస్టుగా మనకూ పరిచయమున్న మహేష్ మంజ్రేకర్ ఈ అంతిమ్ కి దర్శకులు. గతంలో వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ గ్యాంగ్ స్టర్ డ్రామాల నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. ఆయనే తీసిన సంజయ్ దత్ వాస్తవ్ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగినప్పటికీ వీటిని ఎన్నిసార్లు చూసిన విసుగు చెందని ప్రేక్షకులను ఇది మరీ ఎక్కువ నిరాశపరచదు కానీ ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామాను ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం నిరాశతప్పదు. సల్మాన్, ఆయుష్ ల నటన బాగుంది. యాక్షన్ ఎపిసోడ్లు కూడా బాగానే కుదిరాయి. కాకపోతే 90ల నాటి ట్రీట్ మెంట్ తో ఇది బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం మేజిక్ చేస్తుందో అనుమానమే

Also Read : Nandamuri Mokshagna : జూనియర్ బాలయ్య రంగప్రవేశం ఎప్పుడు

Show comments