Idream media
Idream media
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధులను నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అమలుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 14వ తేదీన గెజిట్ జారీ చేయగా.. మూడు నెలలకు అంటే ఈ రోజు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని నాడు కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గెజిట్ అమలుకు అనుగుణంగా తన పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ ఈ రోజు జీవో నంబర్ 54ను జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా గెజిట్‌లో పేర్కొన్న అన్ని ప్రాజెక్టులను అప్పగిస్తేనే.. ఈ ఉత్తర్వులను అమలు చేస్తామని ఏపీ సర్కార్ ఆ జీవోలో పేర్కొంది.
కేఆర్‌ఎంబీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు తన పరిధిలోని ప్రాజెక్టులు, అధికారులు, ప్లాంట్లు, యంత్రాలు, వాహనాలు, డీపీఆర్‌లు బోర్డుకు అప్పగిస్తామని జీవోలో ఏపీ ప్రభుత్వం సవివరంగా పేర్కొంది. హెడ్‌వర్క్ పరిధిలోని డ్యాములు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ స్ట్రక్షర్లతోపాటు తెలంగాణ వివాదంలోకి లాగుతున్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీనీవా ఎత్తిపోతలు, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను కూడా అప్పగిస్తామని ఆ జీవోలో పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతోపాటు జురాల ప్రాజెక్టును కూడా తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం తన జీవోలో స్పష్టంగా పేర్కొంది.
కాగా, తెలంగాణ మాత్రం ఇంకా ఏమీ తేల్చలేదు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కే ఆర్‌ఎంబీకి అప్పగించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈఎన్‌సీ మురళీధర్‌రావు అధ్యక్షుడుగా ఉండే ఈ కమిటీ ప్రాజెక్టులను అప్పగించే విషయంపై సమగ్ర నివేదికను 15 రోజుల్లో అందించాలంటూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ చెబుతోంది. అయితే తెలంగాణ వైఖరి ఇలా ఉంటే.. ఏపీ మాత్రం ముందుగా చెప్పినట్లుగానే ఈ రోజు గెజిట్ అమలుకు వీలుగా జీవో జారీ చేసింది. మరి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Gazette Notification – ప్రాజెక్టులు అప్పగింత లేదు .. అధ్యయనం కోసం కమిటీ