క్రేజీ సినిమాలతో అనసూయ స్పీడ్

యాంకర్ గా పెద్ద స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్న అనసూయకు సిల్వర్ స్క్రీన్ అవకాశాలు కూడా ఇటీవలి కాలంలో చాలా వస్తున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్తగా మెప్పించాక ఎన్నో ఆఫర్లు క్యూ కట్టాయి. కథనం లాంటివి ఏకంగా ఆమెను సోలో హీరోయిన్ గా పెట్టి తీశారు. వాటి ఫలితాలు ఏమయ్యాయనేది పక్కనపెడితే క్షణంలో చేసిన నెగటివ్ క్యారెక్టర్ కూడా చాలా పేరు తీసుకొచ్చింది. అయితే తొందరపడి వరసగా సినిమాలు ఒప్పుకునే పొరపాటు మాత్రం అనసూయ చేయలేదు. ఇప్పటికీ సెలెక్టివ్ గానే ఉంటోంది. ఆరెక్స్ 100 కార్తికేయ చావు కబురు చల్లగాలో ఓ పాత్ర చేసిన అనసూయ లేటెస్ట్ గా మరో ఆఫర్ పట్టేసిందనే వార్త గట్టిగానే ప్రచారమయ్యింది.

గోపిచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో గీతా యువి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ లో అనసూయ చాలా కీలకమైన క్యారెక్టర్ ఒకటి దక్కించుకున్నట్టు అందులో పేర్కొన్నారు. అది కూడా వేదంలో అనుష్క తరహాలో స్టైలిష్ వ్యాంప్ గా ఉంటుందని, వేశ్య పాత్రలు తెరకు కొత్తేమి కాకపోయినా మారుతీ తనను ఇందులో చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టు చాలా చెప్పుకున్నారు. అయితే అలాంటిదేమి లేదని మారుతీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్య ఇలాంటి ప్రచారాలు ఎక్కువవ్వడంతో వెంటనే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీన్ని పక్కనపెడితే అనసూయ నటించిన థాంక్ యు బ్రదర్ త్వరలో విడుదల కానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించడంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేగింది. దీంతో పాటు రవితేజ ఖిలాడీ, బన్నీ పుష్పలోనూ పాత్రలు చేస్తున్న అనసూయకు పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ మూవీలో కూడా ఏదో క్యారెక్టర్ ఆఫర్ చేశారన్న వార్త వచ్చింది కానీ అది నిజమా కాదా అనేది ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మొత్తానికి 2021 అనసూయకు స్పెషల్ ఇయర్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

Show comments