అమ్మ ఒడి.. సామాజిక బడి

  • Published - 05:39 AM, Thu - 9 January 20
అమ్మ ఒడి.. సామాజిక బడి

ప్రభుత్వాలు ఎలా అయితే రాష్ట్రం మీద వచ్చే ఆదాయం నుంచి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అని సంవత్సరానికి ఒక సారి బడ్జెట్ వేసుకుని నిధులు ఖర్చు చేస్తాయో … అలాగే ప్రతి కుటుంబం కూడా తమ నెలసరి ఆదాయానికి తగ్గట్టుగా ఒక బడ్జెట్ వేసుకుని ఆ ఖర్చులు పోగా తమ భవిష్యత్తు అవసరాలకు ఉండేలాగా మిగిలింది ఎంతో కొంత దాచుకుని జీవనం సాగిస్తుంటా(ము)రు. దానికి ఎవరూ అతీతులు కారు, అది ప్రతి ఒక్కరి జీవనశైలి. అలా వేసుకునే బడ్జెట్లో పిల్లల చదువులకు కొంత భాగాన్ని కేటాయించడమనేది కూడా జరుగుతుంది.

వాటిలో చూస్తే ధనవంతులు సకల సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కూళ్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి తమ పిల్లల్ని చేర్పించగలుగుతున్నారు. పట్టణాల్లో, నగరాల్లో మధ్యతరగతికి చెందిన కుటుంబాలు తమ అవసరాల్లో పిల్లల చదువులకు ప్రాధాన్యతని ఇస్తూ మిగిలిన వేరే ఎందులోనో రాజీపడుతూ, అప్పో సొప్పో చేస్తూ తమ పిల్లలను చదివించుకుంటున్నారు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాల విషయానికి వచ్చే సరికి – వారికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చుల పద్దులు ఎక్కువ ఉండటంతో పిల్లల చదువులకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరినే బడికి పంపడం; కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఒక్కరిని కూడా పంపలేకపోవడం వంటివి చాలా కుటుంబాల్లో ఉంటోంది. ఈ ఆర్ధిక అసమానతల మూలంగా దేశభవిష్యత్తును నిర్ణయించగల శక్తిసామర్ధ్యాలున్న పిల్లలు పేదరికమనే ఒకే ఒక కారణంతో మరుగున పడిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పేద పిల్లలందరూ ఆర్ధిక అసమానాలతో సంబంధం లేకుండా తమ వయసు పిల్లలతో అన్ని విధాలుగా పోటీపడి చదువుకునేందుకు, తమ నైపుణ్యం పెంచుకునేందుకు సమానంగా అవకాశం ఉండేలా మొదలు పెట్టిన అద్భుత పథకం ‘అమ్మ ఒడి’. దీనిని పిల్లల కోసం ప్రారంభించిన ఒక పథకం లాగా మాత్రమే కాకుండా ‘చదువుకోవడమనేది పిల్లల హక్కు, తమ హక్కును పిల్లలు సద్వినియోగపరుచుకునేలా ప్రభుత్వం దగ్గరుండి చేస్తున్న ఒక మహత్కర్యం’లా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటిది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి లాగా నేల విడిచి సాము చేసే వ్యక్తి కాదు కనుక పేద విద్యార్థుల చదువుల ఆర్ధిక ఇబ్బందులనే సమస్యకు ఎంతో సులభతరంగా ‘అమ్మ ఒడి’ రూపంలో పరిష్కారాన్ని చూపించారు.

గత ముఖ్యమంత్రి 2018 జనవరిలో కలెక్టర్లను సమావేశానికి పిలిచారు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ‘2019 కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు’ – ఆ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు ఎంతో దూరంగా పరిపాలన సాగించిందనడానికి ఇది ఒక ఉదారహణ – ఆ సమావేశంలో చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి ఏంటంటే – అరవై పాఠశాలల్ని ఒక గ్రూపుగా తీసుకుని 4000 క్లౌడ్ బేస్డ్ వర్చువల్ తరగతులు మొదలు పెట్టమని. ప్రతీ పనికి ఒక గడువు పెట్టినట్టే ఆ కార్యక్రమానికి కూడా అదే సంవత్సరం మార్చ్ 15 కు అది పూర్తవ్వాలని గడువు పెట్టారు.

సమావేశం జరిగిందేమో 2018 జనవరిలో, అక్కడి నుంచి రెండు నెలల్లో 4000 క్లౌడ్ బేస్డ్ వర్చువల్ తరగతులు మొదలు పెట్టేయాలని ఆదేశాలు జారీ చేయడం. అది అమలైపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 2019కి నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించేయాలని ఆయన కోరిక, బహుశా అప్పుడు ఎన్నికలున్నాయి కనుక – అన్నీ ఒక్క సంవత్సరంలోనే అయిపోవాలి. ఎందుకంటే ఎన్నికలున్నాయి కనుక. ఆ క్లౌడ్ బేస్డ్ వర్చువల్ క్లాసు రూములు నిజంగానే వర్చువల్ గా ఎవరికీ కనబడినట్టు లేవు. అవీ క్లౌడ్ బేస్డ్ కదా, ఆ పాలనలో ఆ ‘క్లౌడ్’ కూడా పని చేసినట్టు లేదు. కానీ 2019 ఎన్నికలు మాత్రం వచ్చాయి వంద శాతం అక్షరాస్యత సాధించకపోయినా ఆ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజలు తాము నిజమైన అక్షరాస్యులమనిపించుకున్నారు.

అలాగే – ఈ ‘అమ్మ ఒడి’ పథకం మన రాష్ట్రంలోనే కాదు. మొత్తం దేశానికే మార్గదర్శకం కాబోతుందనడం నిస్సందేహం. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్లుగా దేశం మొత్తం వింటున్న మాట.. ‘బాల కార్మిక వ్యవస్థ’. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ప్రభుత్వం ‘బాల కార్మిక వ్యవస్థ’ ను సమూలంగా నిర్మూలించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ఎన్నో ఎన్జీఓలు, స్వచ్ఛంద సేవా సంస్థలు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నాయి. అయినా కూడా ఈ బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించలేకపోవడానికి గల ప్రధాన కారణం – ‘పేదరికం’. ఇంటిల్లిపాదీ ఏదో ఒక పని చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. మనకు చిన్న చిన్న హోటళ్లలో, ధాబాల్లో, అక్కడక్కడా బాల కార్మికులు కనిపిస్తూనే ఉంటారు.

‘నిర్దిష్ట వయసు కన్నా తక్కువ ఉన్న వారిని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షార్హులు’ అని ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా దీనికి పూర్తిగా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. మనకు కనపడే బాలకార్మికులు వీళ్లయితే కనబడని బాలకార్మికులు – తమ పొలాల్లో తామే వ్యవసాయంలో సహాయానికి వెళ్లే వాళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో యజమానులు, తమ పిల్లలు కూడా ఏదో ఒక హోదాలో జీతం తీసుకుంటున్నట్టు లెక్కల్లో చూపిస్తారు కానీ అలా లెక్క కట్టలేనిది ఈ కూలీకి వెళ్లే పిల్లల పని. ఇలాంటి కనబడని బాల కార్మికుల సంఖ్య కూడా ఎక్కువే. ఆ సమస్యకు ‘అమ్మ ఒడి’ పథకం ఒక ఆశాదీపం కాబోతోంది.

2018 అక్టోబర్లో ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని సారాంశం – ‘ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడేళ్ళలో మూడింతలైన బాల కార్మికుల సంఖ్య’. 2015-16 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలకార్మికులు 13294 మంది ఉండగా ఆ సంఖ్య 2017 సంవత్సరానికి 60038 అయింది. కొన్ని జిల్లాలను చూసినట్లయితే – ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2015-16 సంవత్సరానికి 477 మంది బాల కార్మికులుంటే ఆ సంఖ్య 2017 కి 5738 కి చేరింది – అంటే పదింతలు పెరిగింది. విశాఖపట్నం జిల్లాలో 2015-16 సంవత్సరానికి 428 మంది ఉంటే ఆ సంఖ్య 2018 కి 4818 అయింది. ఈ కథనంలో ఇచ్చిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో బాల కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడమనేది, పేద పిల్లలకు చదువుకునే అవకాశాలు ఏ స్థాయిలో సన్నగిల్లాయనే విషయాన్ని మనకు క్షుణ్ణంగా చెబుతోంది.

రాజకీయాల్ని, పార్టీల్ని పక్కన పెట్టి ఈ ‘అమ్మ ఒడి’ పథకాన్ని పేద విద్యార్థులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలది. పసిపిల్లలందరూ సమానమే, ఎవరూ ఎవరికీ ఎందులోనూ తీసిపోరు. పిల్లలందరికీ సమాన అవకాశాలు కలిగించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఈ పథకం గురించి విరివిగా ప్రచారం చేయాలి, రాజకీయ లబ్ది చూడకుండా అర్హత కలిగిన వారందరూ ఈ పథకం ద్వారా చదువుకునేందుకు సహకరించాలి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ‘అమ్మ ఒడి’ పథకాన్ని జనంలోకి ఎంత బాగా తీసుకెళ్లగలిగితే భావి తరాలకు అంత మంచి చేసినవారు అవుతారు.

2020 సంవత్సరం జనవరి 9న ప్రారంభించబోతున్న ఈ పథకం – ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 43 లక్షల తల్లులకు ఉపకరిస్తుంది. ‘అమ్మ ఒడి’ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారి పిల్లలందరికీ వర్తిస్తుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు అర్హులైన పేద పిల్లల తల్లులకు, సంరక్షకులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు నేషనలైజ్డ్ బ్యాంకులో, లేదా సమీప తపాలా కార్యాలయంలో ఖాతా కలిగి ఉండాలి.

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కల – ‘పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు’ అని. ఆయన కన్న కలను నిజం చేసి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి తీసుకొచ్చిన ఈ ‘అమ్మ ఒడి’ పథకం – పేద ప్రజల పాలిట ఒక వరం

Show comments