30 ఏళ్ల క్రిత‌మే ఈనాడులో బిగ్‌బాస్ షో..

బిగ్‌బాస్ ప్ర‌పంచ‌మంతా కోట్లాది మంది చూస్తున్న షో. ఇత‌రుల జీవితాల్లోకి తొంగి చూడ‌డం , వాళ్ల విష‌యాలు తెలుసుకోవ‌డం మ‌న బ‌ల‌హీన‌త‌. సంఘమంటే అదే. ఇద్ద‌రు చేరితే మూడో మ‌నిషి గురించి చెడ్డ‌గా మాట్లాడుకుంటాం. ముద్దుగా గాసిప్ అని పేరు. ఇత‌రుల లోపాలు, బ‌ల‌హీన‌త‌లు వీటిపైన చ‌ర్చ ఇష్ట‌ప‌డ‌తాం. ఎప్పుడో త‌ప్ప మంచి గురించి మాట్లాడుకోం.

ఇత‌రులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవ‌డమే క‌థ‌, న‌వ‌ల‌, టీవీ సీరియ‌ల్‌, సినిమా, నాట‌కం అన్నీనూ, బిగ్‌బాస్ దీని విశ్వ‌రూపం. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఏడుస్తూ , ఓదారుస్తూ బ‌తుకుతారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే నిరంత‌రం నిఘా. కెమెరాకి తెలియ‌కుండా ఏదీ జ‌ర‌గ‌దు. కార్పొరేట్ సంస్థ‌ల క‌ల్చ‌ర్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ, 30 ఏళ్ల క్రిత‌మే ఈనాడు సంస్థ‌లో ఈ సంస్కృతి వుంది. ప‌ర‌స్ప‌ర అనుమానాలు, అప‌న‌మ్మ‌కాలు, నిరంత‌ర అభ‌ద్ర‌త దాని ల‌క్ష‌ణం. బ‌హుశా రామోజీరావు విజ‌య ర‌హ‌స్యం కూడా!

Read Also:- సునీల్ – మూడు ఎన్నికలు మూడు పార్టీలు , అయినా ఎందుకు గెలవలేకపోయాడు?

1988 తిరుప‌తి ఆంధ్ర‌జ్యోతిలో చేరే నాటికి విప‌రీత‌మైన ప్ర‌జాస్వామ్యం. టైమింగ్స్ , రాక‌పోక‌ల‌పై నిఘా లేదు. లేట్‌గా వ‌చ్చినా అడ‌గ‌రు. ఎన్ని సార్లైనా టీకి వెళ్లొచ్చు. డెస్క్‌లోనే సిగ‌రెట్లు తాగొచ్చు. స్వేచ్ఛ ఎంత ఉన్నా దుర్వినియోగం అయ్యేది కాదు. ఎందుకంటే డెడ్‌లైన్‌లోగా పేజీలు ఇవ్వాల్సిందే. లేట్ అయితే న్యూస్ ఎడిట‌ర్ అడుగుతాడు. స్వేచ్ఛ వ‌ల్ల క్రియేటివిటీ జోరుగా వుండేది. తిరుప‌తి ఆంధ్ర‌జ్యోతి ఆ రోజుల్లో చాలా స‌క్సెస్‌.

మేనేజ్‌మెంట్ ఎడిటోరియ‌ల్‌లోకి చొర‌బ‌డేది కాదు. ఒక‌సారి మూవ్‌మెంట్ రిజిస్ట‌ర్ పెట్టారు. టీకి వెళ్లిన ప్ర‌తిసారి టైం నోట్ చేయాలి. అంద‌రం క‌లిసి ప‌ట్టు ప‌ట్టి తీయించాం. ప‌నివేళ‌లు ఆరున్న‌ర గంట‌లు మాత్ర‌మే. గంట‌ల త‌ర‌బ‌డి చాకిరీ తెలియ‌దు. ఏ విష‌యం మీదైనా Open discussion. మేనేజ్‌మెంట్‌కి మోస్తార‌నే భ‌యం వుండేది కాదు (మోసేవాళ్లు ఉన్న‌ప్ప‌టికీ).

ఉద‌యంలో కూడా ఇదే ప‌రిస్థితి. ఇంకొంచెం అరాచ‌కం కూడా. వార్త‌ల్లో భావోద్వేగాలు, స్పంద‌న‌లు విప‌రీతంగా ఉండేవి.

Read Also:- ఎమ్మెల్సీ పదవుల జాతర, ఆశల పల్లకిలో వైఎస్సార్సీపీ ఆశావాహులు

ఈనాడు ప‌రిస్థితి ఏమంటే అక్క‌డ ప‌నిచేసే డెస్క్ సిబ్బంది చాలా మంది పేర్లు కూడా తెలియ‌ని స్థితి. బ‌య‌ట ఇత‌ర పత్రిక‌ల వారితో క‌లిసే వాళ్లు కాదు. ఒక‌వేళ క‌లిసినా ఎక్కువ మాట్లాడ‌రు. మాట్లాడినా ఆఫీస్ విష‌యాలు అస‌లు మాట్లాడ‌రు. వాళ్ల‌లో వాళ్ల‌కి కూడా పెద్ద‌గా స్నేహాలు, సంబంధాలు వుండేవి కావు. కార‌ణం విప‌రీత‌మైన నిఘా వ్య‌వ‌స్థ‌. మేనేజ‌ర్ల పెత్త‌నం. క్యాజువ‌ల్‌గా మాట్లాడే విష‌యాలు కూడా తెలిసిపోయేవి. వేగులు యాక్టీవ్‌గా వుండేవాళ్లు. ఈనాడులో ఒక‌సారి స‌మ్మె జ‌రిగితే , ప‌రిణామాలు అంద‌రికీ తెలుసు. ఇదంతా భ‌రించ‌డం ఎందుకంటే , జీతం. ఆంధ్ర‌జ్యోతిలో 88లో ప్రొబెష‌న‌రీ స‌బ్ ఎడిట‌ర్‌కి 1300 వ‌స్తే, ఈనాడులో దాదాపు 2 వేలు. ఆ రోజుల్లో గ‌వ‌ర్న‌మెంట్ క్ల‌ర్క్ సాధార‌ణ జీతం 1200. ఈ కార‌ణంతో హింస‌ని భ‌రించేవాళ్లు. అది హింస అని కూడా వాళ్ల‌కి తెలియ‌దు. డ్ర‌గ్స్‌కి అడిక్ట్ చేసిన‌ట్టు, ఉద్యోగుల్ని సంస్థ‌కి అడిక్ట్ చేయ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌.

రామోజీరావు పేరు చెబితేనే హ‌డ‌ల్‌. ఆ పేరుని ప‌ల‌క‌ను కూడా ప‌ల‌క‌రు. ఆయ‌న ప్ర‌స్తావ‌న వ‌స్తే కూచున్న వాళ్లు కూడా లేచి నిల‌బ‌డి చైర్మ‌న్ గారు అని భ‌క్తితో ప‌ల‌వ‌రించేవారు. ఎప్పుడో ఒక‌సారి ఆయ‌న మీటింగ్ పెడితే భ‌యంతో వ‌ణికేవాళ్లు. ఆయ‌న పొగిడితే చాలా రోజులు అదో ప్రెసిడెంట్ మెడ‌ల్‌లా ఫీల్ అయ్యేవారు.

Read Also:- బద్వేల్ బీజీపీ అభ్యర్థిగా సురేష్ పనతాల.. సంఘ్ లెక్కలతో ఫైనల్?

ఇక ఆంధ్ర‌జ్యోతి విష‌యానికి వ‌స్తే మా ఎండీ జ‌గ‌దీష్‌ప్ర‌సాద్ కొంచెం కూడా అహం లేని వ్య‌క్తి. ఏడాదికి ఒక‌సారి తిరుప‌తి వ‌చ్చేవారు. ఆయ‌న ఆఫీస్‌లోకి వ‌స్తే హ‌డావుడి వుండేది కాదు. వెన‌కాముందు కాకారాయుళ్లు క‌న‌ప‌డేవాళ్లు కాదు. భ‌య‌భ‌క్తుల‌తో ఎవ‌రూ లేచి నిల‌బ‌డరు. డెస్క్‌లో మా ప‌ని మాది. క‌నీసం సిగ‌రెట్ల‌ను కూడా ఆర్పే వాళ్లం కాదు. ఒక‌రోజు గోల్డ్‌కింగ్ ద‌ట్టంగా పొగ పీల్చి వ‌దులుతున్న‌ప్పుడు ఎదురుగా ఎండీ క‌నిపించాడు. భ‌య‌మేసింది. చూసీచూడ‌న‌ట్టు వెళ్లిపోయాడు. రామోజీరావు ఎదురుగా ఒక బ‌చ్చా స‌బ్ ఎడిట‌ర్‌ని ఈ విధంగా ఊహించ‌గ‌ల‌మా?

ఒక‌సారి జ‌గ‌దీష్‌ప్ర‌సాద్ రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌కి ఒక స‌బ్ ఎడిట‌ర్ గ‌ల్ల లుంగీతో వ‌చ్చాడు. స్నానం చేస్తున్న‌ప్పుడు వేడి పాత్ర‌లోని నీళ్లు మీద పోసుకుని తొడ‌లు, కాళ్లు కాలిపోయాయి. ప్యాంట్ వేసుకోలేడు.

ఎండీ ఎంత మంచోడంటే గ‌ల్ల లుంగీతో ఎందుకు హాజ‌ర‌య్యాడ‌ని కూడా అడ‌గ‌లేదు. ఆయ‌న హ‌యాంలో సిబ్బందిని దూషించ‌డం ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు. కార‌ణాలు ఏమైతేనేం ఆంధ్ర‌జ్యోతి మూత‌ప‌డింది.

రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలో మ‌ళ్లీ తెరిచారు. తెలుగుదేశం త‌ప్పు చేస్తే త‌మ‌ల‌పాకుతో కొడ‌తారు. కాంగ్రెస్ చేస్తే త‌లుపు చెక్క‌తో బాదుతారు. పాల‌సీలు ఏవైనా స్వేచ్ఛ‌కి ఏనాడూ కొద‌వ‌లేదు. జీతాల అసంతృప్తి త‌ప్ప ప‌ని విష‌యంలో ఒత్తిడి, నిఘా, బిగ్‌బాస్ ల‌క్ష‌ణాలు ఉండేవి కావు. ఇన్‌టైంలో వ‌ర్క్ అయిపోతే చాలు. ఎన్ని గంట‌ల‌కు వ‌చ్చావు, ఎన్నిసార్లు టీకి వెళ్లావు అని అడిగింది లేదు. అమాన‌వీయ ప్ర‌వ‌ర్త‌న ఎప్పుడూ ఎదుర్కోలేదు. 2007 వ‌ర‌కూ ఇలాగే వుంది. ఇపుడు ఆయ‌న పిల్ల‌ల హ‌యాం. ప్ర‌స్తుత ప‌రిస్థితి నాకు తెలియ‌దు.

Read Also:- వైఎస్సార్‌ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు..? కేంద్ర మాజీ మంత్రి వ్యాఖ్యల్లో నిజమెంత..?

ఇక ఈనాడులో బిగ్‌బాస్ ల‌క్ష‌ణాలు పూర్తిగా ముదిరిపోయాయి. ఎవ‌రినీ అక్క‌డ స్నేహంగా ఉంచ‌రు. పోట్లాట పెడ‌తారు. ఎడిష‌న్ ఇన్‌చార్జ్‌, బ్యూరో ఇద్ద‌రూ స్నేహంగా వుంటే డేంజ‌ర్‌. ఒక‌రి ప‌ని తీరుపై ఇంకొక‌రు నిరంత‌రం ఫిర్యాదు చేస్తూ వుండాల్సిందే. నిరంత‌ర నిఘా, వేధింపులు, బ‌దిలీలు కామ‌న్‌. సీనియ‌ర్స్ అంద‌ర్నీ వ‌దిలించుకుంటున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీకి ఆఫీస్ మార్చిన‌ప్ప‌టి నుంచి మ‌రీ న‌ర‌కం. రాక‌పోక‌ల‌కే నాలుగు గంట‌లు, క‌నీసం 9 గంట‌లు డ్యూటీ అంటే రోజుకి 14 గంట‌లు ప‌ని. 6 గంట‌లు నిద్ర అనుకుంటే ప‌ర్స‌న‌ల్ స్పేస్ 4 గంట‌లు. ఇంకా ఘోరం ఏమంటే తెల్లారి 4 గంట‌ల‌కి ఇల్లు చేరిన వాళ్ల‌కి ఉద‌యం 11 గంట‌ల‌కి రామోజీ ఫిల్మ్ సిటీలో మ‌ళ్లీ మీటింగ్ పెడ‌తారు.

సంస్థాగ‌త బ‌లంతో నెట్టుకొస్తూ ఉంది కానీ, తేడా వ‌స్తే మొద‌ట కూలిపోయేది ఈనాడే. అది రామోజీరావు చూడొచ్చు, చూడ‌క‌పోవ‌చ్చు.

జ‌ర్న‌లిజంలో విలువ‌లు, స‌త్య‌శోధ‌న‌, భావ వ్య‌క్తీక‌ర‌ణ అన్నీ వుంటాయి. కానీ జ‌ర్న‌లిస్టుల‌కి కాదు, యాజ‌మాన్యాల‌కి.

ఉద్యోగుల‌కి పెద్ద దిక్కు బిగ్‌బాస్ ఒక్క‌టే. జ‌ర్న‌లిస్టులు నిఘా వేసే కాలం పోయి, నిఘాలో బ‌తికే కాలం వ‌చ్చింది.

Show comments