ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ప్రముఖ బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ దేశాయ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఇక, కోలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నటుడు మోహన్‌ రోడ్డు పక్కన శవంగా తేలారు. ఇండస్ట్రీ ఈ విషాదాల నుంచి తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి మమత గూడూర  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు.

ఆ వివరాల్లోకి వెళితే.. మమత గూడూర బాగల్‌కోట్‌ జిల్లా, ఇళెకల్‌ తాలూకాలోని గూడరలో జన్మించారు. రంగస్థల, సినిమా నటిగా కన్నడ నాట మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె 5 వేలకు పైగా నాటకాల్లో నటించారు. రంగస్థల నటిగా టాప్‌ పొజిషన్‌లోకి వెళ్లారు. సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. దాదాపు 25 సినిమాల్లో నటించారు. అంబరీష్‌, వజ్రముని వంటి టాప్‌ హీరోలతో సినిమాలు చేశారు. గత కొన్నేళ్లనుంచి సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. కేవలం నాటకాల్లో మాత్రమే నటిస్తున్నారు.

అయితే, కొన్ని నెలల క్రితం ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆమె మెదడులో రక్తస్రావం మొదలైంది. దీంతో కుటుంబస​భ్యులు ఆమెను ఇంటి దగ్గరే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగు పడలేదు. గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షణించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో 75 ఏళ్ల వయసులో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మమత మృతిపై చిత్ర, రంగస్థల ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గూడూరలోనే ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

Show comments