ఇద్దరు స్టార్ల సంక్రాంతి పోటీ సహజమే కానీ ఒక ట్రయాంగిల్ వార్ (త్రిముఖ యుద్ధం) మళ్ళీ రిపీట్ కావడం అరుదు. అదెలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004 సంవత్సరం. ఆ ఏడాది జనవరి 14న బాలకృష్ణ లక్ష్మినరసింహ రిలీజయ్యింది. తమిళ బ్లాక్ బస్టర్ సామీ రీమేక్ గా రూపొందిన ఈ పోలీస్ ఎంటర్ టైనర్ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్, పరుచూరి బ్రదర్స్ పదునైన సంభాషణలు, మణిశర్మ సంగీతం తోడై మంచి వసూళ్లు దక్కాయి. అదే రోజు ప్రభాస్ త్రిషల వర్షం బాక్సాఫీస్ రికార్డుల బూజు దులిపేసింది. నిర్మాత ఎంఎస్ రాజు భీభత్సమైన ఫామ్ లో ఉన్న టైమది. ఏది తీసినా హిట్టు కొడుతున్నారు.
శోభన్ దర్శకత్వంలో తేజాబ్ ఫ్రీమేక్ గా రూపొందిన ఈ మూవీ ప్రభాస్ ని మాస్ కి యూత్ కి మరింత చేరువ చేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆయన కెరీర్ టాప్ 5 ఆల్బమ్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. విలన్ గా గోపీచంద్ కి సైతం మరో పెద్ద బ్రేక్ అందించింది. ఒక రోజు ఆలస్యంగా 15న చిరంజీవి అంజిని థియేటర్లలో తీసుకొచ్చారు. అయిదేళ్లకు పైగా నిర్మాణం జరుపుకుని అప్పటిదాకా టాలీవుడ్ లో రాని విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ చాలా రిస్క్ చేసి తీశారు. ఓపెనింగ్స్ మతిపోయేలా వచ్చాయి. థియేటర్లు చాల్లేదు. అయితే మితిమీరిన అంచనాల మధ్య అంజి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఇక్కడ కాంపీట్ అయిన హీరోలు చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ లు. ఇప్పుడు మళ్ళీ ఇదే త్రయం 2023 సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య – వీరసింహారెడ్డి – ఆది పురుష్ లతో తలపడుతున్నారు. అప్పటికి ఇప్పటికి 18 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా కూడా మార్కెట్ లెక్కల్లో వీళ్ళ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా డార్లింగ్ కు ప్యాన్ ఇండియా వచ్చేసింది. సో ఆ టైంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది పక్కనపెడితే ఇప్పుడు ఇప్పుడు మాత్రం యుద్ధం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈసారి అదనంగా విజయ్ వారసుడు కూడా లైన్ లో ఉంది. స్క్రీన్లను సర్దటం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాలే. సో ఇన్నేళ్ల తర్వాత రిపీట్ అయిన ముగ్గురి ముఖాముఖీలో విజయం ఎవరిదో .