హైదరాబాద్‌.. యమపాశంలా మారిన విద్యుత్‌ తీగ.. బైకర్‌ మెడకు తగలటంతో..

నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. విద్యుత్‌ తీగ యమపాశంలా మారి ఓ బైకర్‌ను పొట్టన పెట్టుకుంది. బైకుపై వెళుతున్న అతడి మెడకు ఆ విద్యుత్‌ తీగ తగలటంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఆ విద్యుత్‌ తీగ కారణంగా ఓ స్కూలు బస్సుకు కూడా పెను ప్రమాదం తప్పింది. లేదంటే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈ ఘటన హైదరాబాద్‌ శివారులోని దుండిగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌, దుండిగల్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బైకుపై వెళుతూ ఉన్నాడు. ఓ చోట రోడ్డుపై నీటి గుంట ఉండటంతో దాన్ని తప్పించుకుని వెళ్లటానికి ప్రయత్నించాడు.

ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం పక్కనుంచి బైకును పోనిచ్చాడు. అంతే.. స్తంభానికి వేలాడుతున్న కరెంట్‌ తీగ అతడి మెడకు తగిలింది. అది హై ఓల్టేజ్‌ తీగ కావటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఓ స్కూలు బస్సు అటు వైపు వచ్చింది. బైకర్‌ చనిపోయి ఉండటాన్ని గుర్తించిన డ్రైవర్‌ బస్సును పక్కనుంచి పోనించాడు. దీంతో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లారు. ఆ లైన్‌కు కరెంట్‌ సప్లైని నిలిపివేశారు.

అనంతరం సత్యనారాయణ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. తీగను పైకి పెట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఉరి తాడుల్లా మారిన కరెంట్‌ తీగలపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చూడాలని కోరుతున్నారు. మరి, విద్యుత్‌ యమపాశంలా మారి ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments