Venkateswarlu
Venkateswarlu
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డం బాగా తగ్గింది. ముఖ్యంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో వర్షాల ఊసే లేదు. జులై నెలలో దంచి కొట్టిన వానలు.. ఆగస్టుకు వచ్చే సరికి తగ్గిపోయాయి. ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. కానీ, కొన్ని జిల్లాల్లో మాత్రం చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వర్షాలు పడే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు! మరికొన్ని జిల్లాల్లో చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.