Venkateswarlu
Venkateswarlu
కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కూనవరంలోని వరద బాధిత ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వరద బాధితులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇళ్లలోకి వరద నీరు చేరిన కుటుంబాలకు కూడా సాయం చేస్తామన్నారు. ఆ కుటుంబాలకు 2 వేల రూపాయల సాయం అందిస్తామన్నారు.
కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందించనున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ వరద సాయం అందకుంటే నాతో చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. డబ్బులు మిగిల్చుకోవాలన్న ఆరాటం లేదు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించాం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకుంటున్నాము. పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌కోసం ఆలోచించదు.
ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తాం’’ అని అన్నారు. కూనవరం, వీఆర్‌పురం మండలాల ప్రజలతో మాట్లాడిన తర్వాత కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు కూడా అందిస్తోంది. మరి, సీఎం జగన్ సర్కార్ ఇళ్లలోకి వరద నీరు చేరిన కుటుంబాలకు కూడా 2 వేల రూపాయలు సాయం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.