స్వర్గానికేగిన తెలుగు సినిమా సూపర్ స్టార్..

స్వర్గానికేగిన తెలుగు సినిమా సూపర్ స్టార్..

  • Updated - 06:36 AM, Tue - 15 November 22
స్వర్గానికేగిన తెలుగు సినిమా సూపర్ స్టార్..

సాహసం కన్ను మూసింది. తెలుగు సినిమాకు ఎన్నో కొత్త నడవడికలు నేర్పి ట్రెండ్ అంటే ఏమిటో ప్రేక్షకులకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనకీర్తి స్వర్గానికేగింది. కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతూ సూపర్ స్టార్ కృష్ణగారు తుది శ్వాస తీసుకున్నారు. నిన్న తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన ఆయన పరిస్థితి గురించి వైద్యులు చెప్పిన మాటలు కీడునే శంకించినప్పటికీ ఏదో మంచి జరగకపోదానే అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. భౌతికంగా శాశ్వత సెలవు తీసుకుంటూ మూడు వందల పై చిలుకు చిత్రాలను మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లిపోయారు. ఒక సువర్ణ శకం ముగిసింది. తెలుగు సినీ కళామతల్లి కన్నీరు పెడుతోంది.

కృష్ణగారి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. అయిదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. 1943 మే 31న వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మలకు జన్మించారు. తెనాలికి అతి దగ్గరలో ఉండే బుర్రిపాలెం ఆయన జన్మస్థానం.చిన్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూస్తూ పెరిగి తను కూడా వాళ్ళ లాగా గొప్ప స్థాయికి చేరాలని బిఎస్సి చదువుతున్న రోజుల్లోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న కృష్ణ 1965లో ఆదుర్తి సుబ్బరావు తీసిన తేనెమనసులు ద్వారా తన కలను సాకారం చేసుకున్నారు. మూడో సినిమా గూఢచారి 116తో అప్పటిదాకా ఇక్కడి మాస్ కి పరిచయమే లేని జేమ్స్ బాండ్ సెన్సేషన్ ని టాలీవుడ్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సాహసమే తన ఊపిరిగా మార్చుకున్నారు కృష్ణ.

1970లో పద్మాలయ బ్యానర్ స్థాపించి అగ్నిపరీక్షతో నిర్మాణం మొదలుపెట్టిన కృష్ణ 1982లో అదే పేరుతో స్టూడియో ప్రారంభించి వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు కారణమయ్యారు. 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ రంగప్రవేశం చేశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం తరఫున ఎంపీగా 80 వేల మెజారిటీతో గెలిచి అందులోనూ తనదైన ముద్ర వేయగలిగారు. 1968లో మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారిచే సాక్షిలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం లాంటి మచ్చుతునకలు కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఉన్నాయి. తొలి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సింహాసనం, తొలి కౌబాయ్ మోసగాళ్లకు మోసగాడు ఇలా ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన కృష్ణగారు మనమధ్య లేకపోయినా నిత్యం టీవీలో ఆన్లైన్లో వచ్చే సినిమాల్లో చిరకాలం జన హృదయాల్లో బ్రతికే ఉంటారు.

Show comments