యశోద రివ్యూ

యశోద రివ్యూ

  • Published - 02:48 PM, Fri - 11 November 22
యశోద రివ్యూ

ఈ మధ్య తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ రాలేదు. ఎంతసేపూ కథానాయకుల బలం మీద నడిచేవే తప్ప ఒకప్పుడు విజయశాంతి, అనుష్కలాగా లేడీ బ్రాండ్ తో తీస్తున్న వాళ్ళు తగ్గిపోయారు. ఈ విషయంలో సమంత తన ప్రత్యేకత ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. యుటర్న్ తో మొదటి పరుగు తీయగా ఓ బేబీతో ఏకంగా బౌండరీ కొట్టేసింది. అందుకే యశోద మీద మంచి అంచనాలున్నాయి. అనారోగ్య రిత్యా ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిన సమంత ఆ కారణంగానే ప్రమోషన్లలో నేరుగా పాల్గొనలేక పోయింది. మరి యశోదలో సినిమా టీమ్ చెప్పినంత బలమైన మ్యాటర్ ఉందా లేదా రివ్యూలో చూద్దాం.

కథ..!
చెల్లెలి ఆపరేషన్ కోసం చాలా డబ్బు అవసరమైన యశోద(సమంతా) తప్పని పరిస్థితుల్లో సరోగసి(కృత్రిమ గర్భం)కి ఒప్పుకుని మధు (వరలక్ష్మి శరత్ కుమార్) ఆధ్వర్యంలో నడిచే ఇవా సెంటర్ లో చేరుతుంది. అక్కడే డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందం) పరిచయమవుతాడు. నగరంలో హాలీవుడ్ నటి, యువ వ్యాపారవేత్త హత్య చేయబడతారు. వీటి ఇన్వెస్టిగేషన్ కు పూనుకున్న ఆఫీసర్లు (శత్రు – సంపత్)లకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇవాలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్న యశోదకు స్నేహితురాలి అదృశ్యంతో అక్కడ జరుగుతున్న వాటి మీద అనుమానం వచ్చి నిజాలు తవ్వడానికి పూనుకుంటుంది. ఆ తర్వాత జరిగేదే తెరమీద చూడాల్సిన స్టోరీ.

నటీనటులు..
భారం మొత్తం తన మీద పెట్టిన యశోద క్యారెక్టర్ కు సమంతా చేయాల్సిందంతా చేసింది. టాలీవుడ్ బెస్ట్ పెరఫార్మర్స్ లో ఇది ఒకటిగా చెప్పలేం కానీ అటు ఎమోషన్లు ఇటు ఫైట్లు వీలైనంత వరకు బెస్ట్ ఇవ్వడంలో విఫలం కాలేదు. కేవలం తన కోసమే చూడచ్చనే కంటెంట్ ఓ బేబీలాగా యశోదలో లేకపోవడంతో ఛాలెంజ్ తగ్గిపోయింది. పోరాట సన్నివేశాల్లోనూ మెప్పించింది. అయితే డబ్బింగ్ తనే చెప్పుకోవడం కొంత మైనస్ అయ్యింది. పాత్ర క్యారెక్టరైజేషన్ లో ఉన్న బరువు సామ్ గొంతు వల్ల తగ్గిపోయింది. రెగ్యులర్ గా చెప్పే చిన్మయితో అయితే ఇంకా బాగుండేది. మొత్తానికి యశోదను కెరీర్ టాప్ వన్ అనలేకపోయినా ఫైవ్ లో ఒక ప్లేస్ ఇవ్వొచ్చు.

వరలక్ష్మి శరత్ కుమార్ తనకిచ్చిన మధు రోల్ కి పూర్తి న్యాయం చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో మేకప్ విషయంలో మేకర్స్ ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. బట్ తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ రెండూ ఇలాంటి మైనస్సులను కవర్ చేశాయి. ఉన్ని ముకుందన్  డబుల్ షేడ్స్ లో మెప్పించాడు. మురళి శర్మ, రావు రమేష్, శత్రులవి గతంలో చూసిన తరహాలోనే సాగుతాయి కాబట్టి మరీ కొత్తగా చెప్పడానికేం లేదు. జోష్ రవిని రెండు సీన్లతో మమ అనిపించారు. కల్పిక, దివ్యశ్రీపాద ఉన్నవి కాసిన్ని సీన్లే అయినా చక్కగా ఒదిగిపోయారు. క్యాస్టింగ్ విషయంలో బాగానే శ్రద్ధ తీసుకోవడంతో రాంగ్ ఛాయస్ గా ఎవరూ అనిపించలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్..
దర్శకులు హరి అండ్ హరీష్ అనుకున్న పాయింట్ అయితే మంచిదే. మెడికల్ థ్రిల్లర్స్ ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చినప్పటికీ ఇంత సీరియస్ గా సరోగసీ మాఫియాని ఎవరూ టచ్ చేయలేదు. ఇదే యశోదలో ఉన్న ప్రధాన యునీక్ పాయింట్, నిర్మాత, సమంత ఇద్దరూ ఇక్కడే ఎగ్జైట్ అయిపోయి ఒప్పుకుని ఉంటారు. కానీ ట్విస్టుల మీద ఎక్కువ ఆధారపడ్డ ఈ దర్శక ద్వయం ప్రధానమైన స్క్రీన్ ప్లేని  మాత్రం పూర్తి ఎంగేజింగ్ గా సెట్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులూ ఆసుపత్రిలోనే కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. టేకాఫ్ ఆసక్తికరంగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే ఎస్టాబ్లిష్ మెంట్ సీన్స్ కి సంబంధించి లెన్త్ ఎక్కువయ్యింది.

ఇంటర్వెల్ వరకు అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన హరి హరీష్ లు ఇంటర్వెల్ ముందు మంచి ఆసక్తిని రేకెత్తించి విశ్రాంతి బ్యాంగ్ ని ప్రాపర్ గానే సెట్ చేశారు. అక్కడి నుంచి కథనం పరుగులు పెడుతుందని ఎదురు చూడటం సహజం. కథలో బోలెడు మలుపులు జరుగుతాయి. కానీ దాదాపుగా అన్నీ మన ఊహకు అనుగుణంగానే సాగడం మొదటి మైనస్. మధు గౌతమ్ ల ట్రాక్ ని అంత సేపు చూపించాలనుకున్నప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ప్లాట్ ని కన్విన్సింగ్ గా రాసుకుని ఉండాలి. కానీ ఆమెకు చేసిన అలంకారం లాగే అదీ ఆర్టిఫిషియల్ గా అనిపించడంతో తర్వాత జరిగే వాటికి కనెక్టివిటీ తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.


గతంలో ఈ తరహా సెటప్పు ట్విస్టులు చూసేసి ఉండటం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ మరీ కొత్తగా ఫీలవ్వకపోవచ్చు కానీ సమంత అభిమానులు సినిమాలు తరచుగా చూసేవాళ్లకు మాత్రం కొంత డిఫరెంట్ గానే అనిపిస్తుంది. యశోదకు పెట్టిన ముఖ్యమైన మలుపు ఇక్కడ రివీల్ చేస్తే బాగుండదు కానీ అదీ గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మోడల్ లోనే సాగడంతో ఆ సీన్ జరిగినప్పుడు వావ్ అనే ఎగ్జైట్ మెంట్ రాదు. దాని బదులు సామ్ ని సగటు అమ్మాయిగానే సెట్ చేసి ఆమె చుట్టూ ఆ ఇవా ఆసుపత్రి పన్నిన పద్మవ్యూహంగా చూపించి ఉంటే డ్రామా ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో. సమంత ఎక్కడికక్కడ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో నిలబెడుతూ వచ్చింది.

ఫాంటసీలకు లాజిక్స్ అక్కర్లేదు కానీ యశోద లాంటి వాటికి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే చూపిస్తోంది బర్నింగ్ ఇష్యూ. అందులోనూ సగటు జనానికి అంతగా అవగాహన లేని ఒక చీకటి ప్రపంచం గురించి. అలాంటప్పుడు అందులో జరిగే సంఘటనలు నమ్మశక్యంగా ఉండాలి. ఇవాలో అన్నీ యశోదకు అనుకూలంగా ఉండేలా జరుగుతాయి కానీ ఎడ్జ్ అఫ్ ది సీట్ వచ్చేలా ఎలాంటి షాకింగ్ ఎలిమెంట్స్ ఉండవు. స్టోరీని ఎక్కువ హాస్పిటల్ లోనే లాక్ చేయడం వల్ల వచ్చిన చిక్కే ఇదంతా. మధు గతం తప్ప దాదాపు పాత్రలన్నీ అక్కడే ఉంటాయి. సంపత్ రాజ్ నడిపించే పోలీస్ టీమ్, మినిస్టర్ తప్ప చూసేవాళ్లతో పాటు అందరూ ఇవాలోనే ఉంటారు.

టెక్నికల్ గా యశోదలో మంచి అంశాలున్నాయి. హరి హరీష్ తాము రాసుకున్న స్క్రిప్ట్ ని యధాతధంగా తీశారు. అందులో అనుమానం లేదు. కాకపోతే రైటింగ్ స్టేజిలోనే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ప్రేక్షకులకు ఏ రకంగా కొత్త అనుభూతినివ్వగలం అనే కోణం ఎక్కువ హోమ్ వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా యశోద నెక్స్ట్ లెవల్ లో ఉండేది. ఈ మోతాదు తగ్గడం వల్లే యావరేజ్ కంటే మహా అయితే ఒక మెట్టు పైన ఉంటుందేమో కానీ అంతకు మించి బాక్సాఫీస్ మేజిక్ చేయగలదో లేదో అన్ని వర్గాల ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్టుల ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ జనాన్ని ఫుల్ చేయడం ఇప్పుడు కీలకం.

మాములుగా మళయాలంలో ఎక్కువగా వచ్చే ఇలాంటి జానర్ మూవీస్ ని సమంతా లాంటి హీరోయిన్లు చేస్తేనే రీచ్ ఉంటుంది. అనసూయ తరహాలో ఇది సైకో థ్రిల్లర్ కాకపోయినా అమరావతి టైపులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్న హరి హరీష్ లతో పాటు సామ్ ని ఈ విషయంలో మెచ్చుకోవలసిందే. కాకపోతే వెబ్ సిరీస్ లలో లెక్కలేనన్ని ఇలాంటి సబ్జెక్టులతో ప్రయోగాలు జరుగుతున్నప్పుడు రెండున్నర గంటల పాటు థియేటర్ లో మెప్పించాలంటే మాత్రం కంటెంట్ చాలా బలంగా ఉండాలి. యశోదలో ఇవి కొంత మేరకు బాగానే బ్యాలన్స్ అయ్యాయి కానీ ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం పాస్ మార్కుల కన్నా ఓ పదెక్కువ వచ్చాయి అంతే.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే కుదిరింది. జిబ్రాన్, తమన్ లతో పోలిక తెస్తే ఆ స్థాయిలో అనిపించదు కానీ లేట్ ఏజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న మెలోడీ బ్రహ్మ ఇంత అవుట్ ఫుట్ ఇవ్వడం గొప్పే. పాటలు ఆడియో వీడియో రెండూ పెద్దగా సింక్ అవ్వలేదు. సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ప్రెజెంట్ చేసిన తీరు అశోక్,ఆర్ట్ వర్క్ ని చూపించిన  విధానం బాగున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ నిడివిని రెండు గంటల పదిహేను నిమిషాలకే పరిమితం చేసినప్పటికీ టేకింగ్ వల్ల ల్యాగ్ ఫీలింగ్ అయితే ఉంది. వెంకట్, యానిక్ బెన్ ఫైట్లు బాగా కుదిరాయి. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ గారి నిర్మాణం సబ్జెక్టుకు తగ్గట్టే సాగింది.

ప్లస్ గా అనిపించేవి.. 
సమంతా..
ఇంటర్వల్ బ్లాక్..
కొన్ని ట్విస్టులు..
టెక్నికల్ వర్క్..

మైనస్ గా తోచేవి..
ఫస్ట్ హాఫ్..
కీలకమైన మధు ఫ్లాష్ బ్యాక్..
లాజిక్స్ ని విస్మరించడం..
హాస్పిటల్ సీన్స్..

కంక్లూజన్..
గత కొన్నేళ్లలో సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో విపరీతమైన క్రైమ్ కంటెంట్ వచ్చింది. ఇప్పటికే వస్తూనే ఉంది. ఈ జానర్ ని ఎంచుకునేటప్పుడు ఇంతకు ముందెప్పుడూ రాని థ్రిల్లింగ్ కంటెంట్ ఉంటేనే థియేటర్లలో చూసేందుకు పబ్లిక్ ఇష్టపడుతున్నారు. యశోద ఈ విషయంలో సమంత స్టార్ బ్రాండ్ తో కొంత మేర మెప్పించినప్పటికీ ఓవరాల్ గా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గా నిలవడంలో మాత్రం తడబడింది. మరీ బ్యాడ్ ఛాయస్ అని చెప్పలేం కానీ ఈ తరహా కథలను విపరీతంగా ఇష్టపడే వాళ్లకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది తప్ప కేవలం సామ్ కోసమే చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ని చెక్ లో పెట్టుకుని చూడాలి.

ఒక్కమాటలో – జస్ట్ ఓకే థ్రిల్లర్..
రేటింగ్ – 2.5/5 

Show comments