Rocketry The Nambi Effect రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ రిపోర్ట్

Rocketry The Nambi Effect రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ రిపోర్ట్

మణిరత్నం సఖి సూపర్ హిట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మాధవన్ చేసే సినిమాలు తక్కువే అయినా చాలా సెలెక్టివ్ గా ఉండే అతని టేస్ట్ మీద అభిమానులకు ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటి టాలెంటెడ్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. గత రెండు మూడు వారాలుగా మాధవన్ దీని ప్రమోషన్ కోసం సోలో వార్ చేస్తున్నాడు. నిజాయితీగా తాను చేసిన ప్రయత్నాన్ని ఆశీర్వదించమని దేశవ్యాప్తంగా తిరిగాడు. బయోపిక్కులు క్రమంగా బోర్ కొడుతున్న తరుణంలో ఒక శాస్త్రవేత్త జీవితాన్ని తెరపై చూపాలనుకోవడం సాహసమే. మరి ఇంత రిస్క్ తీసుకున్న మాధవన్ దానికి తగ్గ ఫలితం అందుకున్నాడా లేదా చూద్దాం.

గొప్ప సైంటిస్ట్ గా పేరున్న నంబి నారాయణన్(మాధవన్)జీవితంలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఆయన పరిశోధనలు రాకెట్ వ్యవస్థను ఉన్నత స్థానంలో నిలబెడతాయి. అలాంటి మనిషిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారు. భారతీయ ఆకాశ దళానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బయటి దేశాలకు చేరవేశారన్న అభియోగం మీద జైలుకు తీసుకెళ్తారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవం అన్నీ మట్టి కొట్టుకుపోతాయి. యాభై రోజుల తర్వాత బయటికి వచ్చిన నారాయణన్ తాను నిర్దోషిగా నిరూపించుకోవాలని నిర్ణయించుకుని ఒంటరి పోరాటం మొదలుపెడతాడు. దీనివెనుక ఎవరున్నారు చివరి నంబి ఏ తప్పూ చేయలేదని ఎలా బయటపడిందనేదే స్టోరీ.

అంతా తానై నడిపించిన మాధవన్ అంచనాలకు తగ్గట్టే పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. సిమ్రాన్, క్యామియోలో సూర్య, ఇతర తారాగణం ఎవరికి తగ్గట్టు వాళ్ళు చక్కని నటన కనబరిచారు. కథ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ కథనం విషయంలో వేగం లేకపోవడంతో రాకెట్రీ కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంలో తడబడింది. రాకెట్ సైన్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళతో పాటు క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామ్ సిఎస్ సంగీతం, శిరీష ఛాయాగ్రహణం అండగా నిలబడ్డాయి. కాకపోతే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే స్లో టేకింగ్ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు. మాధవన్ కష్టం, స్ఫూర్తి చెందాల్సిన ఒక నిజ జీవిత సైంటిస్ట్ లైఫ్ ని దగ్గర నుంచి చూడాలంటె మాత్రం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అవార్డులు తెచ్చే కంటెంట్ ఇది. కమర్షియల్ గా ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో బాక్సాఫీస్ వద్ద వసూలయ్యే కలెక్షన్లే సమాధానం చెప్పాలి. చూద్దాం.

Show comments