పెరుగుతున్న కరోనా కేసులు.. సీఎంలతో భేటీకి సిద్దమైన ప్రధాని

పెరుగుతున్న కరోనా కేసులు.. సీఎంలతో భేటీకి సిద్దమైన ప్రధాని

దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రాణాంతక వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందనుకున్న దశలో మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. కరోనా నూతన వేరియెంట్ ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది. ఐఐటీ-మద్రాస్‌లో ఏకంగా 55 మంది విద్యార్థులకు ఈ వైరస్ బారిన పడ్డారు. దేశ రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. ప్రస్తుతానికి దీని సంఖ్య అదుపులోనే ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా విరుచుకుని పడే ప్రమాదం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,593 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 మంది మరణించారు. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. 24 గంటల వ్యవధిలో 794 కేసులు నమోదయ్యాయంటే పెరుగుదల వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. యాక్టివ్ కేసులు 15,873కు పెరిగాయి. ఇదివరకు ఈ సంఖ్య 12,000 లోపే ఉండేది. ఈ నాలుగైదు రోజుల్లోనే 16 వేలకు చేరువ అయ్యాయి.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కోవిడ్ స్థితిగతులపై సమగ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సమావేశం ఉంటుంది. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రులతో సమావేశమౌతారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వాటిని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకునే దిశగా ఆదేశాలను జారీ చేసే అవకాశాలున్నాయి.

వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా ప్రధాని మోడీ సమీక్షిస్తారు. ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్ అందించారనే విషయాన్ని ఆరా తీస్తారు. బూస్టర్ డోసులను సైతం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి వినియోగం ఎలా ఉందనే అంశాన్ని ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకుంటారు. ఇప్పటివరకు 1,87,57,47,873 డోసుల వ్యాక్సిన్‌ను రాష్ట్రాలు వేశాయి . 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. బూస్టర్ డోసు ప్రైవేట్ లో కూడా అందుబాటులో ఉంచారు. ధర భారీగా తగ్గించారు. సర్వీస్ చార్జీలతో కలిపి బూస్టర్ డోసు ధర 375 రూపాయలుగా నిర్ణయించారు.

Show comments