మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో అయిన శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడానికి అలాగే రద్దు చేసుకోవడానికి ఆర్టికల్ 169 కింద అవకాశం కల్పించారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని నిపుణులు, మేధావులు, విజ్ఞానవంతులైన చాలామంది పెద్దల సహకారంతో రాష్ట్రం పురోభివృద్ది కావాలని ఆలోచన చేసి రాజ్యాగంలో ఇచ్చిన 169 ఆర్టికల్ ను ఆసరా చేసుకుని పెద్దలు చేసిన సూచన మేరకు 1958 జులై 1 న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఏర్పాటు చేసి, జులై 7 న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత హైదరాబాద్ , పబ్లిక్ గార్డెన్స్ , జూబ్లి హాల్ లో 90 మంది సభ్యులతో ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుండి మొటూరి హనుమంత రావు, తోట రామ స్వామి, సయ్యద్ ముఖాసిర్ షా లాంటి విజ్ఞానవంతులతో నిరాటంకంగా సాగిన శాసన మండలి ఎన్.టి. రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మొట్టమొదటిసారిగా 1985 మే 31న శాసన మండలి వ్యవస్థ రద్దు అయింది.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

శాసన మండలి రద్దు చేయాలని 24 మార్చ్ 1983న అప్పటి ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని శాశన సభలో ప్రవేశ పెట్టారు. అయితే నాడు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తు కాంగ్రెస్ (ఐ) వాకౌట్ చేయగా జనతా పార్టి సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. నాడు రామారావు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 210 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా సభలో ఉన్న ఏకైక కాంగ్రెస్ సభ్యుడు శీలం సిద్దారెడ్డి ఓటు వేశారు. సభలో 220 మంది లేకుండా తీర్మానాన్ని ఓటుకు పెట్టరాదని కాంగ్రెస్ సభ్యుడు శీలం సిద్దారెడ్డి లేవనెత్తిన సందేహాన్ని నాటి సభా పతి సత్యనారాయణ తొసిపుచ్చారు. సభలో హాజరైన సభ్యులు 211 మంది అని 142 మంది బలపరిస్తే చాలని, కాబట్టి రాజ్యాంగంలో 169వ అధికరణం కింద కూడా ఈ తీర్మానం అనుగుణమైందని నాటి సభాపతి సత్యనారాయణ చెప్పుకొచ్చారు. నాడు ఈ తీర్మాణాన్ని కమ్యూనిస్టు పార్టీలు, స్వతంత్ర ఫ్రంట్ , మజ్లీస్ పార్టీ, సంజై విచార మంచ్ సభ్యులు బలపరిచారు.

Read Also: మండలి రద్దుపై చంద్రబాబు Uturn తీసుకుంటారా ?

మండలి రద్దు చేయాలని నాటి ముఖ్యమంత్రి రామారావు ప్రతిపాదిస్తూ , “ఈనాడు శాసన మండలి రద్దు విషయం ఒక మంచి ఉద్దేశముతోనే నిర్ణయించబడినది. ఎవరిమీదో ద్వేష భావముతో ఈ విద్ధముగా చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించినదని గౌరవ సభ్యులు ఎవరు అనుకోకూడదని విజ్ఞప్తిచేస్తున్నాము. ఇది ఒక్క మన ఆంధ్ర ప్రదేశ్ లోనే జరగబోయేది కాదు. ఇదివరకు పశ్చిమ బెంగాల్ కానీ, పంజాబులో కానీ కౌన్సిల్ ను రద్దు చేసిన సంగతి అందరికి తెలుసు. ముఖ్యంగా కౌన్సిల్ కు ఉన్న అధికారాలేమిటో మీ అందరికి తెలుసు. శాసనసభ ఏదైన ఒక విధానమును నిర్ణయిస్తే, ఆ విధానమును వారి ఆమోదం కొరకు మండలికి పంపినప్పుడు వారు దానిని ఆమోదించకపోతే తిరిగి అసెంబ్లీకి వచ్చి అది ఒక చట్ట రూపం దాల్చుతున్నప్పుడు, దానికి ఎక్కువ అధికారాత్మకమైన అధికారాలు లేకపొవడం ఒకటి. వివిధ రంగాల్లో విజ్ఞులైన వారిని మేధావి వర్గాలను ప్రభుత్వానికి సహాయ పడటానికి ఎన్నుకొంటు రాష్ట్రాభివృద్దిని చేసుకోగలుగుతున్నాము, అటువంటప్పుడు కౌన్సిల్ అవసరం ఉండదేమో అనే భావన ఒకటి. ఈనాడు కౌన్సిల్ కు నామినేషన్స్ వచ్చినప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వారి ఇష్టులను నామినేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ విజ్ఞతకు పరిపూర్ణమైన పరమార్ధము కల్పించబడటంలేదనేది అందరికీ తెలుసు. సదుద్దేశముతో ఉపయోగించుకోలేకపొతున్నాము, దాని అవసరము అంతగా కనపడుటలేదు. పొదుపు విషయంలో చూసినప్పుడు అనవసరం అనుకుంటున్న, పనిచేయటానికి తగిన ఆస్కారంలేని ఈ కౌన్సిల్ ఉండటం వలన ప్రత్యకమైన పరమార్ధం ఏమీ లేదని భావనతో ఈ నిర్ణయాన్ని మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈనాడు కౌన్సిల్ లేని రాష్ట్రాలు సమర్ధవంతంగా నిర్వహించుకో గలుగుతున్నప్పుడు అదే విధానం మనం కూడా అనుసరించడంలో తప్పు లేదని గౌరవ సభ్యులకు తెలియ చేస్తున్నాను. ఏ మాత్రమూ ద్వేష భావముతో కాకుండా ఒక పవిత్రమైన దృష్టితో చేయబడుతున్నది. ఏ వర్గాన్ని కించపరచడానికి చెయబడినది కాదు అనే ఉద్దేశముతో ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. అందరూ కూడ మా ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రతిపాదనను బలపరచాలని ప్రతి ఒక గౌరవ సభ్యుడిని కోరుతున్నాను” అని చెప్పుకొచ్చారు.

Read Also: రూల్ పాటించకపోవటం విచక్షణా?

2004లో వై.యస్ ముఖ్యమంత్రిగా ఉండి విజ్ఞానవంతుల సలహాలు సూచనలు రాష్ట్రానికి ముఖ్యం అని భావించి చుక్కా రామయ్య , డాక్టర్ చక్రపాణి, విఠపు బాల సుబ్రహ్మణ్యం లాంటి విజ్ఞానవంతులతో తిరిగి మండలి కొలువు తీరేలా చేశారు. నాటి వై.యస్ మండలి పునరుద్దరణ ప్రతిపాదనని అసెంబ్లీలో చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తు ఈ మండలి వల్ల అధికారంలో ఉన్న వారికి పదవులు వస్తాయి తప్ప రాష్ట్ర ప్రజలకు లాభం లేదు, దీనివలన కార్యకర్తలకి , నాయకులకి, రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పిస్తారు తప్ప దీని వలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదు. ఒకప్పుడు చదువు కున్న వారు తక్కువ ఉండేవారు అందుకే ఈ శాసన మండలి లొ ఇంటలెక్చువల్స్ ని తీసుకొచ్చి చర్చించాలి అనే ఉద్దేశం ఉండేది. కాని ఇప్పుడు శాసన సభలో ఉన్న 294 మంది అందరు చదువుకున్నవారే. ఇంతకన్న బెటర్ గా శాసన మండలికి వస్తారు అంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. దీనివలన ప్రభుత్వం మీద భారం పడుతుంది తప్ప దేనికి ఉపయోగపడదని ఆనాడు చంద్రబాబు గారు అసెంబ్లీలో అన్నారు.

Read Also: చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. టీడీఎల్పీలో కీలక నిర్ణయం..

విద్యావంతులు ఉండాలని ఏదైతే ఉద్దేశంతో నాడు వై.యస్ పునరుద్దరణ చేశారో, ఆ ఆలోచనను తుంగలో తొక్కుతూ, 5వ తరగతి పాస్ అయిన బుద్దా వెంకన్న, కొడుకు లోకేష్ లాంటి వారితో చంద్రబాబు మండలిని నింపటమే కాకుండా , ప్రజామోదంతో గెలిచిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అతి ముఖ్యమైన బిల్లులకు అడ్డుపడుతూ పాలన స్తంభింపచేసే ఆలోచనలు చేయటంతో నాటి వై.యస్ ఆలోచనకు పూర్తి భిన్నంగా నేడు మండలి వ్యవస్థ రూపొందటంతో మళ్ళీ రద్దు దిశగా అడుగులు పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న విషయం. నాడు రామారావు ,తరువాత చంద్రబాబు నాయుడు మండలి రద్దుని అసెంబ్లీ సాక్షిగా పూర్తి మద్దతు ఇచ్చారు, కానీ నేడు అసెంబ్లీలో జరుగుతున్న చర్చకు హాజరుకాబోమని టీడీపీ సభ్యులు ప్రకటించారు.

Show comments