అన్నీ ఫ్రీ ఫ్రీ! స్టాంప్ పేపర్ పంచేస్తున్న ఆ జిల్లా వాళ్ళు!

  • Published - 04:03 AM, Sun - 21 February 21
అన్నీ ఫ్రీ ఫ్రీ! స్టాంప్ పేపర్ పంచేస్తున్న ఆ జిల్లా వాళ్ళు!

ఎన్నికలంటేనే ఓటర్లు దేవుళ్ళయిపోతారు. వారికీ ఏ మాత్రం లోటు లేకుండా, వారి మనసు గెలుచుకునేందుకు పోటీ చేసే నాయకులు చూపించే శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఆకేసి 60 రుచులు పెట్టినట్లు ఓటర్ లకు కావలసిన అన్నీ ఉచితంగా ఇచ్చేస్తాను అంటున్నాడు ఓ అభ్యర్థి. తనను పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలిపిస్తే, గ్రామంలో ఉన్న వారందరికీ కొన్ని ఉచితాలను ప్రకటించాడు. ఎన్నికల్లో ఏకంగా తనను గెలిపిస్తే అన్నీ ఉచితంగా ఇస్తానని బాండ్ పేపర్ మీద మరీ రాసి పంచేస్తున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక పెద్ద ఊరే! గ్రామ జనాభా 7,840 మంది ఉంటారు. మొత్తం 2,600 కుటుంబాలు. ఊబలంకలో మొత్తం గడప 1884. ఈ పంచాయతీ కీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారి పడాల రంగారెడ్డి తనను, తాను బలపరిచిన వార్డు నెంబర్లను గెలిపిస్తే, పంచాయతీ మొత్తానికి అయిదు అంశాలను ఉచితంగా అందిస్తాం అని ప్రకటించాడు. మొత్తం పంచాయతీలోని 14 వ వార్డుల్లో తన మద్దతుదారులను నిలబెట్టి, వారిని గెలిపించాలని కోరుతున్నాడు. కోరడమే కాదు .. ఏకంగా దానిని ప్రజలు నమ్మేందుకు , చట్టపరంగా 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి ఊరి వారికీ పంచాడు. తాను హామీలు నెరవేర్చకపోతే చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పడం విశేషం.

పంచాయితీలో ఉన్న కుటుంబాలకు ఏడాదిపాటు ఉచితంగా మినరల్‌ వాటర్ ఇంటింటికి ఇవ్వడం, సంవత్సరంపాటు రేషన్ తీసుకునే కుటుంబాలకు రేషన్‌ ఫ్రీగా అందిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాది పాటు కేబుల్‌ ప్రసారాలు ఇస్తామని, గ్రామంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పదివేల రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తామని, గ్రామస్తులు అందరికీ మూడు నెలలకు ఒకసారి బిపి, షుగర్ , థైరాయిడ్ ఇతర ఆరోగ్య పరీక్షలు దగ్గరుండి చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. ఈ హామీలు రాసిన రూ.20 నోటరీ బాండును అందరికీ చూపిస్తూ.. నిన్న టి వరకు ఓట్లు అడిగారు. ఆదివారం చివరి దశలో ఊబలంక గ్రామ ఎన్నికలు జరగనున్నాయి. మరీ రంగారెడ్డి ఇచ్చిన హామీలు ఎంత వరకు ఓటర్లు నమ్మారు? ఆయన కు ఎంత వరకు ఓటు వేశారు అన్నది సాయంత్రం లోపు తేలిపోనుంది.

స్వతంత్ర అభ్యర్థుల ఉత్సాహం

గోదావరి జిల్లాల్లో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థుల ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. కొబ్బరి గోదావరి జిల్లాల్లో నాలుగు దశల పంచాయితీ ఎన్నికల్లో లెక్క వేసుకుంటే మొత్తం 900 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏ పార్టీ మద్దతు లేకుండా తమ పరిచయాలతో, గ్రామంలోని పెద్దల సహకారంతో వీరు పోటీను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడిన వారే. మూడు దశలను కలిపితే ఎప్పటి వరకు సుమారు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో, తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థులు హవా ఎక్కువగా కనిపించింది. ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వారు తమ అనుచరులు అందరినీ వార్డు మెంబర్ గా పోటీ నిలిపి భారీగానే ఖర్చు పెట్టారు. కొన్ని గ్రామాల్లో విందు భోజనాలు, నాన్ వెజ్ కూరల పంపకాలు సాగాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఒక కుటుంబం ఏదీ కోరుకుంటే అది స్వతంత్ర అభ్యర్థి ఇచ్చి గెలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వారు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడకుండా డబ్బు తీయడం విశేషం.

Show comments