iDreamPost
iDreamPost
పన్నెండేళ్ల క్రితం లీడర్ తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా మీద అప్పట్లో దగ్గుబాటి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. బాబాయ్ వెంకటేష్ వారసుడిగా ధీటైన పోటీ ఇస్తాడనుకున్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన ఫ్లాపుల వల్ల మార్కెట్ ఆశించినంత స్థాయిలో పెరగలేదు. కృష్ణం వందే జగద్గురుమ్ హిట్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ బాహుబలి వచ్చేదాకా బ్రేక్ రాలేదు. అందులో కూడా విలన్ క్యారెక్టర్ చేయడం వచ్చిన పాపులారిటీ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయాల్సి వచ్చింది. 2017లో నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ అయినా ఆ దిశగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయలేదు.
ఏవో ఆరోగ్య కారణాలు తర్వాత కరోనా పరిస్థితులు ఆపై పెళ్లి వెరసి రానాకు వద్దన్నా కంటిన్యూ గ్యాప్ రావడం మొదలయ్యింది. చాలా కష్టపడి ఒళ్ళు హూనం చేసుకుని అరణ్యలో నటిస్తే అది కాస్తా దారుణంగా బోల్తా కొట్టింది. ఇదంతా అభిమానులను కలవరపెట్టిన వ్యవహారమే. కానీ ఇప్పుడు సీన్ మారింది. భీమ్లా నాయక్ విజయం కొత్త ఊపిరినిస్తోంది. మెయిన్ హీరో పవన్ కళ్యాణ్ అయినప్పటికీ తనకు ధీటుగా స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన రానాకు వచ్చిన పేరేమి తక్కువేమీ కాదు. ఇప్పటికీ మంచి సబ్జెక్టులు రాసి వాడుకోవాలే కానీ ఖచ్చితంగా అభిమానుల అంచనాలు అందుకోగలడనే నమ్మకాన్ని కలిగించాడు.
ఇప్పుడీ పరిమాణం రాబోయే విరాట పర్వం మీద పాజిటివ్ గా ఉండనుంది. అసలు ఈ సినిమా థియేటర్లో వస్తుందా లేక ఓటిటికి ఇచ్చారా అనే ప్రశ్నకు సమాధానం నెలల తరబడి దొరకడం లేదు. నిర్మాత సురేష్ బాబు అసలు ఆ ప్రస్తావనే తేవడం లేదు. ఇప్పటికైనా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, సాయి పల్లవితో కాంబినేషన్, నందితా దాస్ ప్రియమణి లాంటి సీనియర్లు, వేణు ఊడుగుల దర్శకత్వం ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా ఇంతలా నిర్లక్ష్యం చేయడం ఏమిటో అర్థం కావడం లేదు. దీన్ని పక్కనపెడితే భీమ్లా నాయక్ తో సాలిడ్ గా ప్రూవ్ చేసుకున్న రానా ఇకపై కథల ఎంపికలో వేగం పెంచాల్సిన టైం వచ్చింది
Also Read : March 4th Releases : మార్చి 4 – ఆసక్తి రేపే బాక్సాఫీస్ వార్