iDreamPost
iDreamPost
కర్ణాటక మొత్తం జేమ్స్ నామస్మరణతో ఊగిపోతోంది. రేపు విడుదల కాబోతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాను కనివిని ఎరుగని రీతిలో సెలెబ్రేట్ చేసుకోవడం గతంలో ఈ స్థాయిలో ఎవరికీ జరగలేదన్నది వాస్తవం. ఆ రాష్ట్రంలో ఉన్న థియేటర్లన్నీ వారం రోజుల పాటు ఇదే మూవీని ప్రదర్శించాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. అయినా కూడా దాదాపు అన్ని హౌస్ ఫుల్స్ వైపుగా బుకింగ్స్ పరుగులు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు స్టార్ట్ కాబోతున్నాయి. చనిపోయిన వ్యక్తికి ఈ స్థాయిలో నివాళిని అందించడం చూస్తే పునీత్ జనం గుండెల్లో ఎంత చోటు సంపాదించుకున్నాడో అర్థమవుతుంది
బెంగుళూరులో పలు థియేటర్లలో పునీత్ నటించిన 20కి పైగా సినిమాల కటవుట్లన్నీ వరసగా ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోల రూపంలో వైరల్ అయ్యింది. ఇంతగా పునీత్ కోసం అభిమానులు తపించిపోవడం సామాన్య ప్రేక్షకులను కూడా కదిలిస్తోంది. ట్రేడ్ టాక్ ప్రకారం ఒక్క కన్నడ వెర్షనే 1500కి పైగా స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతోంది. ఇది ఇంకా పెరుగుతోంది. తెలుగు తమిళం వెర్షన్లు కలిపి మరో వెయ్యికి పైగా ఉండొచ్చని ఒక అంచనా. ఒరిజినల్ లో శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. యాక్షన్ కం కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన జేమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించారు.
జేమ్స్ లో శ్రీకాంత్ ఒక విలన్ గా నటించారు. ఇక ఇక్కడి ఓపెనింగ్స్ విషయానికి వస్తే జేమ్స్ కు వారం రోజులు వ్యవధి దొరకనుంది. ఒకవేళ సినిమా బాగుంటే డీసెంట్ కలెక్షన్స్ తో సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25న ఆర్ఆర్ఆర్ వచ్చే లోగా వీలైనంత రాబట్టుకునే ప్లాన్ లో ఉంది. కర్ణాటకలో మెయిన్ సెంటర్స్ లో జేమ్స్ ని అంత త్వరగా తీసేసే సూచనలు లేవు. ఇతర రాష్ట్రాల్లో ప్రభావం చూపించడం కష్టమే. జేమ్స్ ఎలా ఉన్నా ఒక మంచి మనిషి, కేవలం నటనకే పరిమితం కాకుండా బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గొప్ప పనులు చేసిన మానవతావాదిగా అతనికి చివరి నివాళి అందించడానికైనా మూవీ లవర్స్ ఓ సారి థియేటర్స్ కు వెళ్తారు
Also Read : Allu Arjun & SS Rajamouli : ఐకాన్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్