Minister Roja On Chandrababu And Pawan Kalyan: విద్యా దీవెనతో చంద్రబాబు- పవన్ కు మంచి చదువు చెప్పించాలి: రోజా

విద్యా దీవెనతో చంద్రబాబు- పవన్ కు మంచి చదువు చెప్పించాలి: రోజా

నగరిలో జగనన్న విద్యా దీవెన నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి రోజా రాఖీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాఖీ కట్టారు. అలాగే ఈ సభలో చంద్రబాబు- పవన్ కల్యాణ్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఇవే అంటూ దుయ్యబట్టారు. ఇటీవల రజినీ కాంత్ చెప్పిన జైలర్ సినిమా డైలాగ్ ను సభలో చెప్పారు. ఆ డైలాగ్ ద్వారా పవన్- చంద్రబాబులపై మంత్రి రోజా మాస్ కౌంటర్స్ వేశారు. ప్రతిపక్ష నాయకులకు కూడా విద్యా దీవెన ద్వారా మంచి చదువు చెప్పిద్దాం అంటూ రోజా చురకలు అంటించారు.

సభలో మంత్రి రోజా మాట్లాడుతూ.. “చంద్రబాబు- పవన్ కల్యాణ్ ను చూస్తుంటే ఇటీవల విడుదలైన రజినీకాంత్ జైలర్ సినిమా డైలాగ్ గుర్తొస్తోంది. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరే లేదు.. అర్థమైందా రాజా? చంద్రబాబు ఊరూరు తిరుగుతూ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 2024.. జగనన్న వన్స్ మోర్.. అని ప్రజలు జగనన్నకు పట్టం కట్టి 175 సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. నేను ఈ రాయలసీమ గడ్డ నుంచి సవాలు చేస్తున్నాను.. నిన్ను సీఎం చేసిన కుప్పంలో ఇంటింటికి వెళ్దాం. వారికి సంక్షేమ పథకాలు అదించింది నువ్వా.. సీఎం జగనన్నా అని అడుగితే.. జగనన్న అనే చెప్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ ఎలా అయిందో చూశాం. తండ్రీ కొడుకులను హైదరాబాద్ వరకు తరిమి కొట్టారు.

మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూశారా తెల్ల షర్ట్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్లను అయితే అన్న అంటారు. ఆడపడుచులను అయితే చెల్లి అని పిలుస్తారు. ఇది చూసి కూడా పవన్ కల్యాణ్ కడుపుమంట. ఆయన కూడా తెల్ల షర్ట్ వేసుకుంటాడు. అన్న అని పిలుస్తాడు. చిరునవ్వులతో పలకరిస్తాడు నమ్మకండి అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకన్నా చిన్నవాడు.. నాకన్నా అందంగా ఉంటాడు. నాకన్నా ముందే రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు. సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు.

ఇవన్నీ చూసి పవన్ కల్యాణ్ జలసీ ఫీలవుతున్నాడు. ఆరు నెలలు అయితే వాళ్లు వీళ్లు అవుతారు కదా.. అలాగే చంద్రబాబులా పవన్ కల్యాణ్ కూడా జలసీ ఫీలవుతున్నారు. నేను జగనన్నకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను. వారికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించాలని కోరుతున్నాను” అంటూ మంత్రి రోజా చంద్రబాబు- పవన్ కల్యాణ్ కు చురకలు అంటించారు. విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్- జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రూ.680.44 కోట్లు 8.44 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

Show comments