Margadarsi Case-Notices To Ramoji Rao&Sailaja Kiran: మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజలకు బిగ్‌ షాక్‌

మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజలకు బిగ్‌ షాక్‌

మార్గదర్శి కేసులో.. రామోజీరావు, ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌లకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ కేసులో వారిద్దరితో పాటు.. పలువురు ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు సంబంధించి హైకోర్టు.. రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు నోటీసులు జారీచేసింది.

ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు.. తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా అప్పీళ్లో ప్రతి వాదులుగా ఉన్నమార్గదర్శి చైర్మన్‌ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్‌ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్‌ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు, బ్రాంచ్‌ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ కోర్టు.. వీరందరినీ ఆదేశించింది.

తదుపరి విచారణ 18కి వాయిదా..

ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ.. రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్‌ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది.

Show comments