CM Jagan On Mahatma Gandhi: గాంధీజీ చూపిన మార్గంలోనే నడుస్తున్నాం: ముఖ్యమంత్రి జగన్

గాంధీజీ చూపిన మార్గంలోనే నడుస్తున్నాం: ముఖ్యమంత్రి జగన్

  • Author singhj Published - 11:10 AM, Mon - 2 October 23
  • Author singhj Published - 11:10 AM, Mon - 2 October 23
గాంధీజీ చూపిన మార్గంలోనే నడుస్తున్నాం: ముఖ్యమంత్రి జగన్

దేశవ్యాప్తంగా ఇవాళ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతిపితను దేశ ప్రజలందరూ తలుచుకుంటున్నారు.  అహింస ద్వారా ఏదైనా సాధించొచ్చని నిరూపించిన గాంధీజీని ప్రపంచ వ్యాప్తంగా అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత శతాబ్దంలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడిగా గాంధీజీని చెప్పొచ్చు. అహింసతో పాటు సత్యాగ్రహం అనే ఆయుధాలను ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. ఈ రెండు ఆయుధాలను చేతపట్టి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు బాపూ.

బ్రిటీషర్లను భారత్ నుంచి తరిమికొట్టినా, నూలు వడికినా, మురికివాడలు శుభ్రం చేసినా గాంధీజీ అంతే ఒడుపుతో, శ్రద్ధతో ఉండేవారు. దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. ఆయన అసలు పేరు మోహన్​ దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్​లోని కథియావాడ్ జిల్లా, పోరుబందర్​లో 1869 అక్టోబర్ 2న పుత్లీబాయి, కరంచంద్ గాంధీలకు ఆయన పుట్టారు. తాను చదువులో అంత చురుకైన వాడ్ని కాదని స్వయంగా గాంధీనే తెలిపారు. రాజ్​కోట్​లో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం, కథియావాడ్​లో ఉన్నత విద్య సాగింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లిన మహాత్ముడు.. తెల్లవారిపై తిరుగుబాటు అక్కడ నుంచే మొదలుపెట్టారు. అనంతరం 1915లో భారత్​కు తిరిగొచ్చి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.

భారతదేశపు ఆత్మ పల్లెల్లోనే ఉందని గాంధీజీ తరచూ అనేవారు. గ్రామీణ భారతం స్వావలంబన సాధించాలన్నది ఆయన కల. ఆ దిశగా దేశంలోని చాలా రాష్ట్రాలు పురోగతిని సాధిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్​ కూడా దూసుకెళ్తోంది. గాంధీ జయంతి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ దీని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ 154వ జయంతి సందర్భంగా జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఆయన నివాళి సందేశం ఉంచారు. గాంధీజీ మాట‌లు ఆద‌ర్శంగా.. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పాల‌న చేస్తున్నామని ట్వీట్​లో జగన్ రాసుకొచ్చారు. ‘గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మున్ముందు కూడా ఆయ‌న చూపిన మార్గంలోనే న‌డుస్తాం’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: చిక్కుల్లో బాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!

Show comments