అజాత శత్రువా.. ఇక శాశ్వత విశ్రాంతి..

అజాత శత్రువా.. ఇక శాశ్వత విశ్రాంతి..

  • Published - 06:45 PM, Wed - 16 November 22
అజాత శత్రువా.. ఇక శాశ్వత విశ్రాంతి..

ఒక శకం ముగిసిపోయింది. శ్వాస లేకపోయినా తన అయినవాళ్లు అభిమానుల కోసం భౌతికంగా ఇవాళ్టి దాకా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఇకపై ఆ అవకాశం లేకుండా అంత్యక్రియలు పూర్తి చేసుకుని స్వర్గానికి శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతర సినీ ప్రయాణం చేసి అలిసిపోయిన ఆ ప్రాణం చివరికి తన జీవిత భాగస్వాములు ఇందిరాదేవి విజయనిర్మల, పెద్దబ్బాయి రమేష్ బాబులను చేరుకుంది. ఈ మేరునగధీరుడి చివరి దర్శనం కోసం వేలాది అభిమానులు పద్మాలయ స్టూడియోస్ కు విచ్చేయడం చూస్తే కృష్ణ గారు తెలుగు ప్రజల హృదయాల్లో ఎంత సుస్థిర స్థానం సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎవరినీ కదిలించినా కన్నీళ్లు తప్ప ఇంకే మాటలు రాని సందర్భమిది.

నిన్నటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు తర్వాత అంత బలమైన ముద్రవేసిన కథానాయకుడు కృష్ణనే. ఏడాదికి ఇప్పటి హీరోలు రెండు సినిమాలు చేయడమే పెద్ద గొప్పగా మురిసిపోతున్న టైంలో ఒకప్పుడు ఒకే సంవత్సరంలో 18 సినిమాలు విడుదల చేయించిన ఘనత ఒక్క కృష్ణ మాత్రమే దక్కిందంటే అతిశయోక్తి కాదు. రెండు మూడు సీన్లకే అలసిపోయి క్యారవాన్లో గంటల తరబడి రెస్టులు తీసుకుంటూ గడుపుతున్న కొందరు యువతరం హీరోలు అప్పట్లో కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో మూడు షిఫ్టులు పని చేస్తూ కనీసం నిద్రపోయే టైం లేక నిర్మాతలను అభ్యర్థించడం చూస్తే కష్టమంటే ఏంటో చెప్పే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో..

మూడు వందల నలభైకి పైగా సినిమాల్లో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, పద్మాలయ స్టూడియోస్ అధినేతగా, ఎంపిగా ఇలా తాను అడుగుపెట్టిన ప్రతిదాంట్లో విజయం అందుకున్న కృష్ణ చివరి రోజుల్లో మేకప్ వేసుకోలేదేమో కానీ ఇండస్ట్రీకి మాత్రం అతి దగ్గరగా ఉన్నారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా కొద్దిరోజుల క్రితం ఆలీ నిర్మించిన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి టీజర్ ని లాంచ్ చేయడం ఆయన మనసును చాటుతుంది. మహేష్ బాబుని తన తర్వాతి సూపర్ స్టార్ గా కనులారా చూసుకున్నారు. డెబ్భై తొమ్మిదేళ్ల సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించి సెలవు తీసుకున్నారన్న మాటే కానీ మన మనసుల్లో సూపర్ స్టార్ చోటు శాశ్వతం.

Show comments