వ్యాధులు – అపోహలు

వ్యాధులు – అపోహలు

కరోనా వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఒకవైపు, వ్యాధి సోకిన వారికి వైద్యం మరోవైపు. అసలు ఈ వ్యాధి మన గడపవరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మూడునెలలు వృధా చేశాం. అది వేరే విషయం.

ఎందుకో కానీ భారత దేశంలో వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే పద్దతి చాలా యేళ్ళుగా లేదు. దురదృష్టవశాత్తు వ్యాధులను సామాజిక రుగ్మతలుగా చూడడం అలవాటు చేసుకున్నాం. వాటిని గోప్యంగా దాచుకుని తీరా అవి ముదిరిన తర్వాత ఆందోళన చెందుతున్నాం.

1980 దశకంలో “గుప్త వ్యాధులు” (శృంగార సంబంధమైనవి) చాలా ఎక్కువగా ఉండేవి. ప్రజల్లో అలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా లేక అదేదో సామాజిక రుగ్మతగా చూసి, ఎవరికీ చెప్పకుండా, చెప్పడానికి సిగ్గుపడి వైద్యం చేసుకోకుండా వ్యాధులు ముదరబెట్టుకునే పరిస్థితి ఉండేది. తీరా జబ్బులు ముదిరాక ఎవరో కొందరు నకిలీ వైద్యులు చికిత్స పేరుతో దోచుకునే వారు. సరిగ్గా ఈ సమయంలోనే డాక్టర్ సమరం “స్వాతి” పత్రిక ద్వారా ఇలాంటి వ్యాధులకు చికిత్స సూచించి ప్రజల్లో అవగాహన పెంచారు.

ఆతర్వాత 1990 దశకంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల కూడా ప్రజలు ఇలానే ప్రవర్తించారు. ఎవరికీ చెప్పకుండా HIV దశలోనే దానికి వైద్యం చేయించుకోకుండా ముదరబెట్టుకుని, ఈ లోగా దాన్ని ఇతరులకు అంటించి ఆ వ్యాధికి బలయ్యారు. ఎయిడ్స్ సోకిందని చెప్పుకోడానికి సిగ్గుపడి గోప్యత పాటించేవారు.

ఇప్పుడు 2020 దశకంలో కరోనా వచ్చింది. విచిత్రం ఏమంటే 1980, 1990 దశకాల్లో వచ్చిన రెండు వ్యాధుల్లా శృంగార సంబంధమైన వ్యాధి కాకపోయినా దురదృష్టవశాత్తు గోప్యత పాటించి దాన్ని మరింత మందికి పంచే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానం ఉన్నవారు వైద్యం ఎందుకు చేయించుకోవడం లేదో తెలియడం లేదు.

బహుశా ఈ వ్యాధి ప్రారంభంలో మితిమీరిన ప్రచారం చేయడం వల్లనేమో, పరీక్ష చేయించుకున్నా పక్కవాళ్ళకు తెలుస్తుందని, తమను నిందిస్తారని, దూరంగా పెడతారని అనవసర భయం పెంచుకుని పరీక్షలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వ్యాధిని కుటుంబసభ్యులకు, పక్కవారికి పంచిపెడుతున్నారు.

కరోన సోకడం సామాజిక రుగ్మత కాదనీ, వైద్యం లేని వ్యాధి కాదనీ గ్రహించకపోవడం దురదృష్టకరం. ప్రజలు, ముఖ్యంగా అనుమానితులు తక్షణమే వైద్యం చేయించుకుని వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రధమ కర్తవ్యం.

ఈ వ్యాధి లక్షణాలున్న వారిపట్ల చిన్నచూపు చూడడం కూడా మంచిది కాదు. కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వైద్యం చేయించుకునేందుకు చొరవతో ముందుకువచ్చే విధంగా రాజకీయ వ్యాఖ్యలు ఉండకపోవడం దురదృష్టకరం.

కరోనా ఒక వ్యాధి మాత్రమే. వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది. ఈ స్పృహ ప్రజల్లోపెరగాలి.

Show comments