Kshemanga Velli Labhamga Randi : క్షేమంగా చూపించి లాభాలను ఇచ్చింది – Nostalgia

Kshemanga Velli Labhamga Randi : క్షేమంగా చూపించి లాభాలను ఇచ్చింది – Nostalgia

ఫ్యామిలీ మూవీ అంటే చిన్నా పెద్ద తేడా లేకుండా వయసులో వ్యత్యాసం చూసుకోకుండా అందరినీ మెప్పించేది. హాయిగా నవ్వించాలి. ఆలోచింపజేయాలి. చక్కని పాటలతో అలరించాలి. ఇవన్నీ ఒకే సినిమాలో ఊహించుకోవడం కొంచెం కష్టమే కానీ ఒకప్పుడు ఇలాంటి చక్కని ఎంటర్ టైనర్స్ చాలానే వచ్చేవి. దానికో చక్కని ఉదాహరణ క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఆ విశేషాలు చూద్దాం. 1999లో వి శేఖర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన విరాలుక్కెత్త వీక్కం సూపర్ హిట్ అయ్యింది. పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా మొదటి వారం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంలో రీమేక్ హక్కులు కొన్నారు నిర్మాత ఎడిటర్ మోహన్. ఇది ఇక్కడ ఆడుతుందానే అనుమానం వ్యక్తం చేసినవాళ్లు లేకపోలేదు.

కానీ మోహన్ గారి లెక్కలు వేరు. ఆయన చేసిన రీమేకులన్నీ మంచి లాభాలు ఇచ్చినవే. మామగారు, బావ బావమరిది, పల్నాటి పౌరుషం, హిట్లర్ ఇలా ఎంఎల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రాలన్నీ అధిక శాతం కనక వర్షం కురిపించాయి. అందుకే ఈసారి కూడా తన లెక్క తప్పదనే నమ్మకంతో రైట్స్ కొనేసి అప్పటిదాకా అసోసియేట్ గా పని చేస్తున్న రాజా వన్నెంరెడ్డికి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారు. రచయిత రాజేంద్రకుమార్ సహాయంతో మన ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఒరిజినల్ వెర్షన్ మాదిరి కాకుండా క్యాస్టింగ్ లో జాగ్రత్త తీసుకుని స్టార్ ఫ్లేవర్ జోడించారు. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, రోజా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళను తీసుకున్నారు. ప్రత్యేక క్యామియోలో రవితేజ కూడా కనిపిస్తారు.

వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా వి జయరాం ఛాయాగ్రహణం సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలు స్వయంగా మోహన్ గారే చూసుకున్నారు. చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నదానితో సంతృప్తి చెందక అత్యాశకు పోయి వ్యసనాలకు దగ్గరై బ్రతుకును నరకం చేసుకుంటారు. వీళ్ళలో మార్పు తెచ్చేందుకు పెళ్ళాలు నడుం బిగించి కుటుంబ పోషణ తీసుకుంటారు. పైకి సీరియస్ పాయింట్ గా కనిపించినా పూర్తి స్థాయి వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దిన తీరు క్లాసు మాస్ తేడా లేకుండా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఫలితంగా 2000 ఫిబ్రవరి 4న విడుదలైన క్షేమంగా వెళ్లి లాభంగా రండి విపరీతమైన లాభాలు ఇచ్చింది. ఇప్పటికీ బ్రహ్మానందం-కోవై సరళ కామెడీని చూస్తూ నవ్వకుండా ఉండటం అసాధ్యం

Also Read : Sankranthi 1987 Releases : ఆసక్తి రేపే పండగ సీజన్ సినిమాల కబుర్లు – Nostalgia

Show comments