ఆ మాజీ మంత్రి రూటే సపరేటు..!

ఆ మాజీ మంత్రి రూటే సపరేటు..!

విమర్శలు, ఆరోపణలు చేయడంలో రాజకీయ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కొ రూటు. ఇందులో మాజీ మంత్రి, టీడీపీ నేత అయిన కేఎస్‌ జవహర్‌ది అందరి కన్నా భిన్నమైన రూటు. నా దారి రహదారి అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా విమర్శలు చేయడంలో జవహర్‌ నడుస్తుంటారు. టీడీపీ నేతలు కొందరు అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇందులో కేఎస్‌ జవహర్‌ ఒకరు. అయితే ఈ మాజీ ఉపాధ్యాయుడు.. గాలిలో రాళ్లు వేసిన మాదిరిగా ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా జవహర్‌ ఎర్ర చందనం విషయంలో వైసీపీ ప్రభుత్వం, నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ భారీగా జరుగుతోందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని జవహర్‌ ఆరోపించారు. విలువైన ఎర్రచందనం సంపదను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తూ వైసీపీ నేతలు కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హాయంలో స్మగ్గింగ్‌ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. అంతేకాదు పట్టుబడిన ఎర్రచందనం విక్రయించి ప్రజా సంక్షేమానికి వినియోగించినట్లు చెబుతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక స్మగ్లర్లను బయటకు తీసుకు వచ్చి ప్రకృతి సంపదను కొల్లగొట్టిస్తున్నారని అర్థరహితమైన విమర్శలు చేశారు.

జవహర్‌ వ్యవహార శైలి తెలియని వారు ఆయన విమర్శలు, ఆరోపణల్లో వాస్తవం ఉందనుకునే అవకాశం ఉంది. అయితే ఆయన గురించి పూర్తిగా తెలసిన వారు మాత్రం.. మంత్రిగా ఉన్నప్పుడైనా.. మాజీ అయిన తర్వాత అయినా కూడా జవహర్‌ వ్యవహార శైలి మాత్రం మారలేదనుకుంటున్నారు. టీడీపీ హాయంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న జవహర్‌.. బీరు హెల్త్‌ డ్రింక్‌ అని ప్రకటించి విమర్శలపాలయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో గంజాయి సాగు చేస్తున్నారని మంత్రి హోదాలో ఆరోపించి సంచలనం సృష్టించారు. ఒక మంత్రిగా ప్రభుత్వంలో కొనసాగుతూ.. తమ పరిపాలన సమయంలోనే సెంట్రల్‌ జైలులో గంజాయి సాగు చేస్తున్నారనే అర్థరహితమైన విమర్శలు చేసి నవ్వులపాలయ్యారు.

అదే తరహాలో నేడు ఎర్ర చందనం విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వంపైనా, వైసీపీ నేతలపైనా ఆరోపణలు చేస్తున్నారని జవహర్‌ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన జవహర్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయంలో సాధారణ రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించకుండా… నిర్మాణాత్మకమైన విమర్శలు, ఆధారసహితమైన ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షిస్తారు.

Show comments