మాయమైపోతున్నదమ్మ మానవత్వం….

మాయమైపోతున్నదమ్మ మానవత్వం….

  • Published - 06:18 AM, Sat - 27 June 20
మాయమైపోతున్నదమ్మ మానవత్వం….

మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా ప్రజల్లో మాత్రమే కాదు, అధికారుల్లో కూడా మార్పు రావడం లేదు. కరోనా సోకిందేమో అన్న భయంతో సాటి మనిషికి సాయం చేయకపోవడం కారణంగా ఎందరో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే కరోనా కారణంగా మరణించిన మృతదేహాల తరలింపులో కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

కొన్నిరోజుల క్రితం పశ్చిమబెంగాల్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాల తరలింపుపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారంమే చెలరేగింది. సాక్షాత్తు ఆ రాష్ట్ర గవర్నర్ కరోనా వ్యాధి సోకి మరణించిన వారి మృతదేహాలను ఈడ్చుకెళ్తున్న వీడియోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన 72 ఏళ్ళ మున్సిపాలిటీ మాజీ ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ తో మరణించారు. గ్రామ వాలంటీర్ అయిన అతని మనుమరాలు మున్సిపల్ అధికారులకు తన తాతయ్య మరణించిన విషయాన్ని తెలియజేయగా అతని డెడ్ బాడీని ప్రొటెక్టివ్ సూట్లు ధరించిన సిబ్బంది ఓ జేసీబీ యంత్రంలో స్మశాన వాటికకు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీ ద్వారా తరలించిన వీడియో బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులను సస్పెండ్ చేసింది.

సమయానికి వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో అత్యవసరంగా మున్సిపల్ సిబ్బంది చేసేది లేక రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగించే జేసీబీ వాహనాన్ని వినియోగించినట్టు ఆ అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం.కొవిడ్‌ మృతుల విషయంలో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన నిబంధనలున్నా వాటిని ఉల్లంఘించి జేసీబీతో మృతదేహాన్ని తరలించడాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. అమానవీయంగా వ్యవహరించిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ని శ్రీకాకుళం కలెక్టర్‌ నివాస్‌ విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

Show comments